సింగిల్ సింహానికి దమ్ముంటే… ఇదెక్కడి సవాలురా… బాబోయ్!

Buddha Venkana

ఇంతకాలం టిడిపి, జనసేనలకు దమ్ముంటే వేర్వేరుగా పోటీ చేయాలని, దమ్ముంటే 175 సీట్లకు పోటీ చేయాలంటూ జగన్మోహన్‌ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తెగ సవాళ్ళు విసిరేవారు. నేటికీ విసురుతూనే ఉన్నారు. జగన్మోహన్‌ రెడ్డి తాను సింహంలా సింగిల్‌గా వస్తుంటే టిడిపి, జనసేనలు కలిసి తోడేళ్ళ గుంపులా వస్తున్నాయంటూ ఎద్దేవా చేసేవారు.

తాను పైనున్న ఆ దేవుడిని, బటన్ సభలకు సమీకరణ చేసి తెచ్చిన ప్రజలనే నమ్ముకొన్నానని, నేను మీకు మేలు చేశాను కనుక మీరు కూడా నాకు మేలు చేయాలని అడుగుతుంటారు. ఈ రెండూ ట్యూన్స్ సరిగ్గా మ్యాచ్ అవడం లేదనిపిస్తుంది.

ADVERTISEMENT

ఎందుకంటే 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని నిజంగా నమ్మితే సింహంలా గర్జించాలి తప్ప ప్రజలకు మొరపెట్టుకోకూడదు కదా?నన్ను గెలిపించమని ప్రజలకు మొరపెట్టుకొంటున్నప్పుడు సింగిల్ సింహాన్ని నేను గర్జించకూడదు కదా?

అయితే ఒకే గొంతులో నుంచి ఆ వేడికోళ్ళు, గర్జనలు రెండూ వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని పక్కన పెడితే, ఇప్పుడు టిడిపి సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ఓ సవాలు విసిరారు.

ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి వైసీపి ఓటమి ఖాయం అని జగన్‌ గ్రహించినందునే చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. కానీ ఎవరిని ఎక్కడి నుంచి నిలబెట్టినా ఎవరూ గెలవలేరని మీకు తెలుసు. అయినా మేమే గెలుస్తామని గొప్పలు చెప్పుకొంటున్నారు కనుక మీకు దమ్ముంటే 153 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ధైర్యంగా ఎన్నికలకు వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలి,” అని సవాల్ విసిరారు.

మరో సీనియర్ నేత నాగుల్ మీరా మాట్లాడుతూ, “తాడేపల్లి నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ వస్తే సంతోషంగా వస్తున్నారు. టికెట్‌ వస్తే సంతోషమే. ఒకవేళ రాకపోతే ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోవచ్చని అనుకొంటున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు వెనకాడుతుంటే, మిగిలిన వారిని జగన్మోహన్‌ రెడ్డే పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది వైసీపి ఎమ్మెల్యేలని జగన్‌ బయటకు గెంటేస్తే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వైసీపి ఓటమికి సంకేతాలే కదా?” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories