ఉచిత ప్రయాణం అవసరమా? రాయితీ చాలు!

chandrababu-naidu-apsrtc-bus

టీడీపీ ఎన్నికల హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఇంతవరకు అమలుచేయలేదని వైసీపీ విమర్శిస్తూనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడుగా ఈ హామీ అమలుచేసి ఎన్ని ఇబ్బందులు పడుతోందో చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 40 శాతం మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి ఆర్టీసీకి సుమారు రోజుకి రూ.6-7 కోట్లు, నెలకు సుమారు రూ. 200 కోట్లు ఆదాయం ఆర్టీసీకి లభిస్తోంది. ఈ పధకం అమలుచేస్తే ఆ ఆదాయం కోల్పోతుంది.

ఉచిత ప్రయాణం లభిస్తే రోజుకి సుమారు 10 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. కనుక ఆ మేరకు అదనపు భారం కూడా భరించాల్సి ఉంటుంది.

ఈ పధకంతో పెరగబోయే రద్దీని తట్టుకునేందుకు అదనంగా మరో 2,000 కొత్త బస్సులు, డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్కులు తదితరులు కలిపి మరో 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఇవన్నీ కూడా ఆర్టీసీకి, ప్రభుత్వానికి అదనపు భారమే అని వేరే చెప్పక్కర లేదు.

అలాగని ఈ హామీ లేదా పద్ధకాన్ని ప్రభుత్వం వాయిదా వేస్తే వైసీపీ ఊరుకోదు. అమలుచేస్తే ఇంత అదనపు భారం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

సంక్రాంతి పండుగ నుంచి ఈ పధకం అమలుచేయాలని మొదట భావించినప్పటికీ ఈ నివేదికలో వివరాలు నిశితంగా గమనిస్తే దీని అమలుకి ఇంకా మరికొంత సమయం అవసరమని స్పష్టమవుతోంది.

ఇదివరకు జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతూ, దాని కోసం ఎడాపెడా అప్పులు చేసింది. చివరికి ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు కూడా తాకట్టు పెట్టేసింది.

పైగా ఉచిత భారాన్ని మళ్ళీ ప్రజలపైనే మోపేది. “జగన్‌ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో వెనక్కు తీసుకునేవారని” చంద్రబాబు నాయుడే విమర్శించేవారు.

కనుక ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించి, ఆ భారాన్ని ప్రజలపై వేస్తే అప్పుడు అందరూ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతారు. కనుక పూర్తిగా ఉచిత ప్రయాణం బదులు మహిళలకు టికెట్లపై 50-60 శాతం రాయితీ ఇస్తే తక్కువ నష్టం, తక్కువ భారంతో దీనిని అమలు చేయవచ్చు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ప్రజలందరికీ పూర్తి అవగాహన ఉంది కనుక ఎవరూ ఇందుకు ప్రభుత్వాన్ని తప్పు పట్టరు.

ఈ పధకం అమలే ముఖ్యం తప్ప పూర్తిగా ఉచితమా కాదా అనేది ముఖ్యం కాదు. ప్రజల భారం వేయకుండా వారిని సంతృప్తి పరిచి ఇది ‘మంచి ప్రభుత్వం’ అనిపించుకుంటే చాలు.

వైసీపీ విమర్శలను అసలు పట్టించుకోనవసరమే లేదు. వాటి వలన దానికే నష్టం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories