జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ నిర్వహించబోతున్నట్లు జనసేన పార్టీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో సోషల్ మీడియాలో మళ్ళీ ఆంధ్రా-తెలంగాణ అంటూ వాదోపవాదాలు మొదలైపోయాయి.
పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే జనసేనని ప్రకటించినప్పుడు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. పైగా అది కూడా ప్రజారాజ్యంలాగే ఓ ఆర్నెల్లు తర్వాత మూత పడుతుందని పలువురు జోస్యం చెప్పారు. కానీ వారి జోస్యం ఫలించలేదు.
అప్పుడు ఫలించకపోయినా ఈసారి తప్పకుండా ఫలిస్తుందని, ఎందుకంటే కాంగ్రెస్ పాలనతో వేసారిపోయారని కొందరు వాదిస్తున్నారు.
ఆంధ్రా ప్రజలు కూడా ఇలాగే వైసీపీ పాలనతో వేసారిపోయాక మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెట్టినట్లే తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌కి తెచ్చుకోబోతున్నారనే మంచి లాజిక్ చెప్తున్నారు. కనుక తెలంగాణలో బిజేపి, టీఆర్ఎస్, జనసేన మరే పార్టీకి చోటు లేదని వాదిస్తున్నారు.
ఈ నెల 10 ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ఇళ్ళకు వెళ్ళడం ద్వారా తెలంగాణలో మూడు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయనే తొలి సంకేతం ఇచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సభలో బెంగాల్ తర్వాత బిజేపి టార్గెట్ తెలంగాణయే. ఈసారి తప్పకుండా ఎన్నికలలో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు.
ప్రతీ ఎన్నికలలో గెలుస్తామనే చెపుతుంటారు కనుక ప్రధాని మోడీ మాటలు పట్టించుకోనవసరం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాద్‌లో జనసేన సభ నిర్వహిస్తుండటం దేనికంటే తెలంగాణలో ఆ పార్టీని యాక్టివ్ చేయడానికే… ఇది బిజేపి ప్లాన్‌లో భాగమే కావచ్చు కదా?
తెలంగాణలో ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్యనే సాగింది. బిజేపి మూడో స్థానంలోనే ఉండిపోతోంది.
రాష్ట్రంలో బలంగా ఉన్న బిజేపిఏ మూడో స్థానంలో ఉన్నప్పుడు ఉనికేలేని జనసేనని ప్రజలు పట్టించుకుంటారా? ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నప్పుడు, మరో పక్క టీఆర్ఎస్ పార్టీతో కల్వకుంట్ల కవిత కూడా నిలబడుతున్నప్పుడు ప్రజలు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపిల మద్య చీలిపోవచ్చు కానీ జనసేన ఏ పార్టీ ఓట్లను చీల్చలేదని సహేతుకమైన వాదనలు వినిపిస్తున్నాయి.
కానీ బిజేపి, జనసేన రెండూ కూడా ఓటమిని తట్టుకొని నిలబడగల పార్టీలే. ఏపీలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రాజకీయ వ్యూహాలు మార్చుకుంటూ పోటీ చేసిన అన్ని స్థానాలలో పార్టీని గెలిపించుకున్నారు. తాను డెప్యూటీ సిఎం పదవి చేపట్టి పలువురికి మంత్రి పదవులు కూడా దక్కేలా చేశారు.
ఒకప్పటి పవన్ కళ్యాణ్ వేరు. సుమారు పన్నెండేళ్ళు రాజకీయాలలో డక్కామొక్కీలు తిని అనుభవంతో రాటు తేలిన ఇప్పటి పవన్ కళ్యాణ్ వేరు. కనుక తెలంగాణలో జనసేనపై దృష్టి పెట్టి పనిచేయడం మొదలు పెడితే ఆటుపోట్లు తట్టుకుంటూ ముందుకే సాగవచ్చు. ఏపీలో సంపాదించుకున్న రాజకీయ అనుభవంతో తెలంగాణలో కూడా బిజేపితో కలిసి ఓ సుదీర్గ పోరాటానికి పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నట్లు భావించవచ్చు. అవునో కాదో జూన్ 2న చెప్తారు.




