ఇటీవల రాజమండ్రి (వేమగిరి)లో జరిగిన టిడిపి, జనసేన, బీజేపీల ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, ఊహించిన్నట్లే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ సభలో ప్రధాని మోడీ తనంతట తానుగా మరో ముఖ్య విషయం ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర గడ్డు పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిన పెట్టడమే కాకుండా చాలా అభివృద్ధి చేశారని ప్రధాని మోడీ ప్రశంశించారు.
కానీ చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే 5 ఏళ్ళలో అన్ని విదాలుగా భ్రష్టు పట్టించేశారని మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి, అరాచక పాలన తప్ప మరేమీ కనబడటం లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టంగా చెప్పారు.
చంద్రబాబు నాయుడు-జగన్మోహన్ రెడ్డి ఇద్దరి ఆలోచనలు, విధానాలు, పాలనలో తేడా సామాన్య ప్రజలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా తెలుసు. అదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ నోట వినిపించడం వలన చంద్రబాబు నాయుడు పట్ల రాష్ట్ర ప్రజలకు మరింత నమ్మకం పెంచుతుంది.
ముఖ్యంగా కూటమి విజయానికి దోహదపడే అమరావతి, పోలవరం, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రానికి సహాయసహకారాలు అందించడం వంటి కొన్ని ముఖ్యాంశాలపై కూడా ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. అమరావతి, పోలవరం రెంటి నిర్మాణాలకు తమ కూటమి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మోడీ, రెండేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలు ఇంతకాలం ఈ రెండు హామీల కోసమే కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూశారు. కానీ కేంద్రం జగన్మోహన్ రెడ్డిని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకునేందుకు అనుమతించడంతో మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆశ వదిలేసుకున్నారు.
ఎన్నికల గంట మ్రోగిన తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపి మూకలు రెచ్చిపోతుంటే కేంద్ర ఎన్నికల కమీషన్ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు బీజేపీ (కేంద్ర ప్రభుత్వం) మీద ఇంకా అనుమానాలు, అపోహలు పెరిగాయి. రాష్ట్రంలో డీజిపితో సహా కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులపై వేటు వేయడం ద్వారా, వేమగిరి సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ద్వారా ఆ అనుమానాలను, అపోహలను కొంత వరకు తొలగించారనే చెప్పవచ్చు. కానీ నేటికీ రాష్ట్ర ప్రజలకు బీజేపీ నిబద్దతపై అనుమానాలు, అపోహలు ఉన్నాయి.
టిడిపి, జనసేనలు అన్ని ఆటుపోటులను, వైసీపి పెట్టిన అన్ని అగ్నిపరీక్షలను నిబ్బరంగా ఎదుర్కొని బలంగా కలిసి నిలబడగలిగాయి. కనుక ఆ రెండు పార్టీల మద్య ఓట్ల బదలాయింపు జరగడం ఖాయమే.
ఇప్పుడు టిడిపి, జనసేనల ఓట్లు కూడా బీజేపీకి బదలాయింపు జరగాలంటే ప్రధాని నరేంద్రమోడీ ప్రజలలో బీజేపీ పట్ల అనుమానాలు, అపోహలు పూర్తిగా తొలగించే విదంగా రాష్ట్రాభివృద్ధికి సంబందించిన అంశాలపై మరింత స్పష్టమైన హామీలు ఇవ్వాల్సి ఉంటుంది.
ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్ళీ వైసీపితో లోపాయికారి సంబంధాలు కొనసాగించమనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రాష్ట్రంలో బీజేపీని ఇంకా అనుమానంగా చూస్తున్న ప్రజలు కూడా పోలింగ్ రోజున బీజేపీకి ఓట్లు వేసేందుకు సంకోచించరు.
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏపీలో టిడిపి, జనసేనలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం మొదట రాజంపేటలో, తర్వాత విజయవాడలో ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలో మోడీ పాల్గొనబోతున్నారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ నేటి పర్యటనలో రాష్ట్ర ప్రజలకు ఆ నమ్మకం కలిగిస్తారని ఆశిద్దాం.




