తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో నుంచి కేసీఆర్ పేరుని తుడిచేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తుండేవారు. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమలుచేస్తున్న నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తే వారి ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అర్దమవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి ఆ అవకాశం కల్పించింది కేసీఆరే అని చెప్పక తప్పదు.
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పిల్లర్లు కట్టిన మూడేళ్ళకే క్రుంగిపోవడంతో దానిపై విచారణకు ఆదేశించారు.
ప్రాజెక్టులో నీళ్ళు నింపి నిలువచేసుకొని వేసవిలో ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, ప్రజల ముందు కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టేందుకు వర్షాకాలంలో నీటిని నిలువ చేయకుండా రేవంత్ రెడ్డి వదిలేశారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read – వివేకానంద గురించి జగన్ ట్వీట్
అంటే ఏ కాళేశ్వరం పేరుతో కేసీఆర్ గొప్ప పేరు సంపాదించుకున్నారో అదే ప్రాజెక్టుతో ఆయనని దెబ్బ తీస్తున్నారనుకోవచ్చు.
కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేయిస్తున్నారనే విషయం ఆనాడు చంద్రబాబు నాయుడే బయటపెట్టారు. ఆవిదంగానే రేవంత్ రెడ్డిని వల వేసి పట్టుకొని ఓటుకి నోటు కేసులో బుక్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read – ఈ టాలీవుడ్‌కి ఏమైయిందో?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ సొంత పార్టీ నేతలతో సహా రాష్ట్రంలో ప్రముఖుల అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించారనే విషయం బయటపెట్టి విచారణ జరిపిస్తున్నారు. ఒకవేళ ఆ కేసులో కేసీఆర్ నేరాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించగలిగితే బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం తధ్యం.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారో లేదో తెలియదు. కానీ ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలు కేసీఆర్ ఉనికిని చెరిపేసేవిగానే కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని కాదని, తెలంగాణలో సాధారణ మహిళలను పోలిన రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయించడం అటువంటి ప్రయత్నమే.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు పంపిణీ చేయబోయే పాఠ్య పుస్తకాలపై కొత్త తెలంగాణ తల్లి బొమ్మని, తాము రూపొందించిన రాష్ట్ర గీతాన్ని ముద్రించాలని నిర్ణయించడం వంటివి కేసీఆర్ ఉనికిని చెరిపే సేందుకు చేస్తున్న ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీటి వెనుక ఓ దీర్గకాలిక ప్రణాళిక ఉన్నట్లనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలద్రొక్కుకోవాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే భావన పూర్తిగా తుడిచిపెట్టేయడం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు.
కేసీఆర్ స్థానంలో ప్రజలు సోనియా గాంధీ, ఇందిరమ్మలను తలచుకునేలా చేసేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అందరూ చూస్తూనే ఉన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజునాడు అంటే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం పెట్టి, ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవం జరిపించాలనే నిర్ణయాలు అందుకే.
అయితే రేవంత్ రెడ్డి ఆలోచనలు, ప్రయత్నాలు, వాటి పర్యావసనాలను కేసీఆర్ పసిగట్టలేరని అనుకోలేము. అయినా కూడా ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోకోకపోగా సినిమాలలో హీరోలకి ఎలివేషన్స్ ఇచ్చిన్నట్లు, కేటీఆర్, హరీష్ రావు తదితరుల చేత తనకు ఎలివేషన్స్ ఇప్పించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
రేవంత్ రెడ్డి ఈ ఆలోచనలు ఫలిస్తాయా? ఆయన నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తారా లేదా? రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించి బిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా లేదా బెడిసికొట్టి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా? అనేది కాలమే చెపుతుంది.