ఎవరైనా నేరం చేస్తే లేదా నేరారోపణతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపుతుంటారు. కానీ జైల్లో ఉండగానే మళ్ళీ అరెస్ట్ అవడం గురించి బహుశః ఎవరూ విని ఉండరు. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకి అటువంటి భాగ్యం దక్కింది. సీబీఐ అధికారులు ఆమెను ఈరోజు తిహార్ జైల్లోనే అరెస్ట్ చేశారు.
ఈడీ అధికారులు మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ప్రశ్నించి అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె ఈడీ అధీనంలో ఉండగానే సీబీఐ అధికారులు, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో జైల్లోనే ఆమెను లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్నించి, అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం ఆమెను తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని తమ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. ఆమెను సీబీఐ అరెస్ట్ చేసినందున, పద్దతి ప్రకారం రేపు ఉదయం వైద్య పరీక్షలు జరిపించి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు.
ఒకవేళ కోర్టు ఆమెకు మళ్ళీ 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన్నట్లయితే, కోర్టు అనుమతితో ఆమెను సీబీఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని ఈ కేసులో ప్రశ్నిస్తారు.
ఇంతకాలం ఈ కేసులో నగదు లావాదేవీల కోణంలోనే ఈడీ ప్రధానంగా విచారణ జరిపింది. ఇప్పుడు సీబీఐ అధికారులు ఆమెను ఈ కుంభకోణం ఏవిదంగా చేశారనే కోణంలో ప్రశ్నించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు.
ఈడీ నమోదు చేసిన ఇదే కేసులో ఆమె ఈ నెల 23వరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండాలి. ఈ నెల 16న రౌస్ అవెన్యూ కోర్టు ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
ఆమె బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చేలోగానే సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడంతో, ఈడీ కేసులలో ఆమెకు బెయిల్ లభించినప్పటికీ, సీబీఐ కేసులో బెయిల్ కోసం మళ్ళీ వేరేగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈడీ కేసులో ఆమె మార్చి 15న అరెస్ట్ కాగా నేటికీ బెయిల్ లభించకపోవడంతో జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేసింది కనుక మళ్ళీ మరోసారి బెయిల్ పిటిషన్ ప్రక్రియ మొదలుపెడితే అది పూర్తవడానికి మరో నెల రోజులు పట్టవచ్చు. అంటే మే 16వరకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కల్వకుంట్ల కవిత జైలులోనే ఉండాల్సి రావచ్చు.
కూతురు జైల్లో ఉండగానే మళ్ళీ అరెస్ట్ అయిన వార్త ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా… ఆమె తల్లితండ్రులకు చాలా బాధ కలిగించవచ్చు. కానీ లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వచ్చేసినందున కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఆమెను ఓదార్చడానికి… కనీసం ఆమె కోసం బాధపడటానికి కూడా సమయం లేదు పాపం!




