ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ హైదరాబాద్, బంజారాహిల్స్ లో ముస్లిం మహిళను వెంబడించినట్టు నిర్ధారణ అయ్యింది. రావెల సుశీల్ ఓ ముస్లిం మహిళను అడ్డగించి, చేయిపట్టి కారు లోపలికి లాగే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రావెల సుశీల్ ఆమెను కారులో వెంబడించినట్టు నిర్ధారించే సీసీ టీవీ పుటేజ్ ను సంపాదించారు. దీనిని వివిధ టీవీ చానెళ్లు ప్రసారం చేయడంతో, సుశీల్ ఆమెను వెంబడించినట్టు, సదరు మహిళ భయంతో నడుస్తున్నట్టు స్పష్టమైంది.
సుశీల్, కారు డ్రైవర్ రమేష్ పై బంజారాహిల్స్ పోలీసులు సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. తాజా పరిణామంతో నేడు ఉదయం సుశీల్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసిన… ‘తాను ఆమెను వేధించలేదని, కుక్కను రక్షించేందుకు ప్రయత్నిస్తే ఆమె వేధించినట్టు చెబుతోందని, తనపై వారు దాడి చేశారని’ పేర్కొన్న విషయం పచ్చి అబద్దమని తేలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం పరారీలో ఉన్న సుశీల్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కేసులో తానూ జోక్యం చేసుకోబోనని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇప్పటికే తెలియజేసారు.



