తెలుగు సినిమాలలో ఎలాగూ రక్తం ఏరులై పారుతుంటుంది. దర్శక నిర్మాతలకు అంత రక్తదాహం దేనికో తెలీదు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయాలలో కూడా రక్తపాతం మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు ‘రప్పా రప్పా’ అంటూ కోళ్ళు, మేకలను బలివ్వడంతో రక్తపాతం మొదలైంది. కానీ ‘ఇది ట్రైలర్ మాత్రమే మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా సినిమా చూపిస్తామని’ బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కనుక ఆంధ్రా ప్రజలు అలాంటి సినిమా చూడాలనుకుంటున్నారో లేదో ఎన్నికలు జరిగితే గానీ తెలియదు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ‘గంగి గోవు’ అనుకొని పట్టించుకోలేదు. ‘కొడితే జాక్ పాట్ కొట్టాలి’ అనుకుంటూ ప్రధాని మోడీ, అమిత్ షాలని టార్గెట్ చేసుకొని చేసిన ప్రయత్నాలు బ్యాక్ ఫైర్ అయ్యాయి.
పైగా గంగి గోవు అనుకున్న కాంగ్రెస్ పార్టీ కొమ్ము విసిరితే ఫామ్‌హౌసులో పడి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ స్టోరీ.. ఫ్లాష్ బ్యాక్ కూడా ఇప్పుడొద్దు.
కేసీఆర్ ఫామ్‌హౌసులో నుంచి బయటకు ఎందుకు రావడం లేదో ఎవరూ చెప్పడం లేదు కానీ ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇది చారిత్రిక అవసరమని కేటీఆర్ నొక్కి చెపుతున్నారు.
కానీ ఆ నొక్కి చెప్పడం కోసం సిఎం రేవంత్ రెడ్డిని ‘ఔలాగాడు.. ఉరి తీసినా తప్పులేదు’ అంటూ మాట్లాడుతున్నారు.
కనుక సిఎం రేవంత్ రెడ్డి కూడా “కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి వేలకోట్లు దోచుకొని రైతులకు తీరని అన్యాయం చేసినందుకు ‘కల్వకుంట్ల రక్తాన్ని పంటలకు జల్లాలి,’ అంటూ రక్తపాతం మొదలుపెట్టారు.
కేటీఆర్ కూడా తగ్గేదేలే అంటూ ‘సోనియా, రాహుల్ రేవంత్ రెడ్డిలతో సహా కాంగ్రెస్ నేతలందరికీ ‘డెత్ డిక్లరేషన్’ ప్రకటించాల్సిందే. రేవంత్ రెడ్డికి ‘హిట్లర్’ కంటే దారుణమైన క్లైమాక్స్ ఉంటుంది,’ అని అన్నారు.
వెంటనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘ఈసారి ఎన్నికలలో కేసీఆర్‌ని గజ్వేల్లోనే సమాధి చేస్తా’ అని అన్నారు.
చెప్పులు, చీపురు కట్టలతో తరిమి కొట్టాలనే దశ నుంచి ఈవిధంగా డెత్ డిక్లరేషన్లు, సమాధుల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వచ్చేశాయి.
అంటే అభివ్రుద్ధిలోనే కాదు.. రాజకీయాలలో కూడా రప్పారప్పాతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాజకీయాలలో పురోగతి వచ్చేసిందన్న మాట! కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్ ఎర్రెర్రగా కనిపిస్తోంది.




