ఉన్నట్టుండి కేంద్రానికి ఏపీ మీద దయకలిగినట్టు ఉంది. నిన్న టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబందించిన సమస్యలను ప్రస్తావించారు. శుక్రవారం వారు కోరిన వెంటనే ప్రధాని అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. దాదాపు సంవత్సరంగా చంద్రబాబుకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది ప్రధాని కార్యాలయం.
విభజన సమస్యలు అన్నిటిని పరిష్కరిస్తానని, రాష్ట్రానికి అండగా ఉంటానని అన్నారని ఎంపీలు చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ అడిగారని, రెండు ,మూడురోజులలో సమావేశం అవుతానని కూడా ఆయన అన్నారట. అదేవిధంగా ఏపీ కోరినట్టుగా అప్పర్ కాఫర్ డాంకు అనుమతి ఇచ్చింది కేంద్రం.
ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాంస్ట్రాయ్ పనులు పూర్తి చేసే సామర్ధ్యం కలిగి లేదని ఏపీ చేస్తున్న వాదనతో విభేదించి కొన్ని పనులకు ఇచ్చిన టెండర్లను ఆపేసింది కేంద్రం. మొత్తానికి మొన్న ఏపీ ప్రభుత్వం వాదనే కరెక్ట్ అని ఒప్పుకుని టెండర్లకు పచ్చ జెండా ఊపింది కేంద్రం. అయితే ఈలోగా ఎంతో విలువైన నెలన్నర కాలం వృథా అయ్యింది.
అయితే ఇప్పుడు అంతా చర్చించుకుంది ఏంటంటే ఇప్పటిదాకా నిమ్మకు నీరెత్తకుండా ఉన్న కేంద్రం ఉన్న పళంగా ఏపీ విషయంలో ఎందుకు కదిలిందా అని? ఇది ఇలా ఉండగా ఏపీ బీజేపీ నాయకులు మాత్రం ఇంకా మిత్రపక్షమైన టీడీపీ మీద కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. లోగుట్టు పెరుమాలకెరుక!



