గడిచిన రెండు రోజుల నుంచి రాష్ట్రమంతా చంద్రబాబు ఆరోగ్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని, బరువు కూడా తగ్గిపోయారని, వైసీపీ ప్రభుత్వం సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ బాబు ఆరోగ్యం పై తమకు ఆందోళనగా ఉంది అంటూ తమ బాధను పంచుకున్నారు.
అయితే అనుకున్నట్లే తమకు అలవాటైన భాషలో, రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉంటే ఆపార్టీ నేతలను ఇంతలా కించపరచొచ్చా? అన్నట్లుగానే వైసీపీ నేతలనుండి ప్రతిస్పందన వచ్చింది. ఒకరేమో బాబు జైల్లో ఉండి రాష్ట్రంలో కుట్రలకు వ్యూహాలు పన్నుతున్నారు అని మరొకరేమో బాబు జైల్లోనే సంతోషంగా ఉన్నారని, జైలుకి వచ్చాక బాబు బరువు పెరిగారని, బాబు కి ఇంటి నుండి వచ్చే భోజనం ఒక్కసారి లోకేష్ కు పెట్టి పరీక్షించిన తరువాతనే బాబుకి పంపాలంటూ ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు వైసీపీ నేతల రాజకీయ విధానాలను ప్రజలకు తెలిసొచ్చేలా చేశారు.
బాబు కి న్యాయస్థానాలలో బెయిలు రాకపోవడంతో ఇటువంటి డ్రామాలకు బాబు తెరలేపారు. ఇది తెలుగు డ్రామా పార్టీ అంటూ విజయసాయి రెడ్డి తన X మాధ్యమాల్లో స్పందించారు. అయితే ఇందులో ఎవరి మాట వాస్తవం అనేది తాజాగా విడుదలైన చంద్రబాబుని పరీక్షించిన వైద్యుల నివేదికతో తేటతెల్లమైంది.
ఈ నెల 12 వ తేదీన చంద్రబాబు ని పరీక్షించిన వైద్యుల బృందం ఆయనకు ఛాతి, గడ్డం,వీపు ,చేతులు, మెడ భాగంలో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ తో బాబు బాధపడుతున్నారని ఆయనను చల్లని వాతావరణంలోనే ఉంచాలని నివేదిక అందించారు. అయితే లోకేష్ అన్నట్లే ఈ వైసీపీ ప్రభుత్వం, అధికారులు కలిసి రిపోర్ట్ ఇచ్చి రెండు రోజులు గడుస్తున్నా ఆ విషయాన్ని దాచి పెట్టి ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారో అంటూ టీడీపీ వర్గాలు మండిపడుతున్నారు.
ఇంకా కొద్దిసమయంలో బాబు కుటుంబసభ్యులు లోకేష్, భువనేశ్వరి,బ్రాహ్మణి ములాఖత్ లో భాగంగా చంద్రబాబుని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లనుండడంతో ఎటు ఈ విషయం ఇంకా దాచలేము అని భావించే ప్రభుత్వం ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన నివేదికను బయట పెట్టి ఉండవచ్చు అంటూ టీడీపీ శ్రేణులు వాదిస్తున్నారు.
ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విఐపి గదిని సిద్ధం చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇంతటి అత్యవసర వైద్యం చేయాల్సిన పరిస్థితి తలెత్తే వరకు జైలు అధికారులు, ప్రభుత్వ పెద్దలు వినోదం చూస్తున్నారా? అంటూ బాబు శ్రేయోభిలాషులు ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. అసలు చంద్రబాబుని ఈ ప్రభుత్వం ఎం చెయ్యాలని బావిస్తుందో తమకు అర్ధం కావడం లేదని చంద్రబాబు ఆరోగ్యం పై వైసీపీ ప్రభుత్వాన్ని తాము నమ్మే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెపుతున్నారు.
చంద్రబాబు కి అనుకోనిది ఏమైనా జరిగితే దాని పూర్తి బాధ్యత జగన్ ప్రభుత్వానిదే అంటూ వైసీపీ నేతలను, ప్రభుతాన్ని హెచ్చరిస్తున్నారు బాబు అభిమానులు. అంతా బాగుంది అంటూ ప్రభుత్వం చెపుతుంటే మరి ఈ నివేదిక పరమార్థం ఏమిటి? అసత్యాలతో ఎంతోకాలం ప్రజలను మభ్య పెట్టలేరని ప్రభుత్వాలు గుర్తించాలి. “రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అధికారం వేదిక” కాకూడదని ప్రభుత్వాలు గ్రహించాలి.



