టిడిపి ఎన్డీయే కూటమిలో చేరబోతున్నట్లు చంద్రబాబు నాయుడు చూచాయగా చెప్పేశారు. కనుక బీజేపీ కూడా టిడిపి, జనసేనలతో కలిసి ఎన్నికలలో పోటీ చేయబోతోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో జరిగిన చర్చలలో బీజేపీకి 5-6 లోక్‌సభ, 10-12 అసెంబ్లీ స్థానాలను కోరిన్నట్లు తెలుస్తోంది. వాటిలో విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలను బీజేపీ కోరిన్నట్లు తెలుస్తోంది.
ఇక జనసేన మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి లోక్‌సభ స్థానాలను, 25-30 అసెంబ్లీ స్థానాలు కోరిన్నట్లు తెలుస్తోంది.
టిడిపి, జనసేనలు ఇప్పటికే కొన్ని స్థానాలకు తమ తమ అభ్యర్ధులను ఖరారు చేసుకున్నాయి. కానీ బీజేపీ కూడా తమతో కలిస్తే మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందనే ఆలోచనతో అధికారికంగా ప్రకటించలేదు.
ఇప్పుడు టిడిపి, బీజేపీ పొత్తులు దాదాపు ఖరారు అయిన్నట్లు తెలుస్తోంది. కనుక టిడిపి, జనసేనలు రెండూ తమ పార్టీలో ఆశావాహులకు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు నచ్చజెప్పుకోవలసి ఉంటుంది. ఇది ఆ రెండు పార్టీలకు చాలా చాలా ఇబ్బందికరంగా మారుతుందని వేరే చెప్పక్కరలేదు.
అందుకే పార్టీలో చర్చించుకున్న తర్వాత పొత్తుల గురించి నిర్ణయం తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలకు చెప్పి తిరిగివచ్చారు.
బీజేపీతో పొత్తులు ఖరారు చేసుకున్న తర్వాత ఏపీలోని మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ సీట్ల సర్దుబాట్లపై మరోసారి లోతుగా చర్చించిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయబోతోందనేది ప్రకటిస్తాయి.
బీజేపీతో పొత్తుతో టిడిపి, జనసేనలు ప్రధానంగా ఏమి ఆశిస్తున్నాయంటే, ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్ల ద్వారా కట్టడి చేయాలని! అప్పుడే టిడిపి, జనసేనలు విజయం సాధించగలవు. లేకుంటే ఎన్నికలలో వైసీపి దౌర్జన్యాలను అడ్డుకోవడం చాలా కష్టమని టిడిపి, జనసేనలు భావిస్తున్నాయి.
ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకుని రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగితే ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విదాల తోడ్పడుతుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
ఇందుకు ప్రతిగా టిడిపి, జనసేనలు తమ సీట్లను కొన్ని బీజేపీకి వదులుకోవలసి ఉంటుంది. టిడిపి, జనసేనలకు ఇది చాలా ఇబ్బందే. మరి ఆశావాహులకు నచ్చజెప్పుకుంటాయో లేక వదులుకుంటాయో రాబోయే రోజుల్లో అందరూ చూడవచ్చు.






