చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, “మీరు మూడు దశాబ్ధాలుగా చంద్రబాబు నాయుడుని గెలిపిస్తూనే ఉన్నారు. ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని సరదాగా అడిగారు.
ఆమె సరదాగా అన్న ఆ మాటని పట్టుకొని, మంత్రులు రోజా, అంబటి రాంబాబు, పలువురు వైసీపి నేతలు, వారి ఆత్మసాక్షి “కుప్పంలో ఈసారి ఓటమి తప్పదని గ్రహించే చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరిని పోటీ చేయించాలని అనుకుంటున్నారు. కానీ కుప్పం నుంచి ఆమె పోటీ చేసినా ఓటమి తప్పదు. చంద్రబాబు నాయుడు తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని భార్య చేత చెప్పించారు. ఈ ఎన్నికల తర్వాత ఎలాగూ ఆయన రాజకీయాల నుంచి రిటైర్ కాక తప్పదు,” అంటూ చాలానే చెప్పుకున్నారు.
నిజానికి వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో నేతలే ఓటమి భయంతో, తీవ్ర అభ్రద్రతాభావంతో ఉన్నారు. అది వారి చేతలు, మాటల్లోనే బయట పెట్టుకుంటున్నారు కూడా. అందుకే ఇలాంటి చిన్నచిన్నవాటిని కూడా వైసీపి నేతలు భూతద్దంలో నుంచి చూస్తూ, తమకు అనుకూలంగా అన్వయించుకొని సంతోషపడుతుంటారు. తీవ్ర ఆందోళన, అభద్రతాభావంతో ఉన్న వైసీపి నేతలకు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలా అవసరమే. లేకుంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే పార్టీలో నుంచి వలసలు మొదలైపోతాయి.
కానీ వారికి ఆ అల్పసంతోషం కూడా లేకుండా చేస్తూ టిడిపి, జనసేనలు నేడు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాయి. చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకున్న మంత్రులు, వారి ఆత్మసాక్షి ఇప్పుడు ఏమి చెపుతుంది?మా ఒత్తిడి భరించలేకనే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీకి ‘సిద్దం’ అవుతున్నారని చెప్పుకుంటారేమో?




