ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపికి అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి టిడిపికి సానుభూతి పెరిగేలా చేయడం, ఆ కారణంగానే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొనేలా చేయడంతోనే వైసీపికి కొన్ని అపశకునాలు మొదలయ్యాయి.
గత ఎన్నికలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపికి ఎంతో తోడ్పడిన కేసీఆర్ ఎన్నికలలో ఓడిపోవడం ఓ అపశకునమే. ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మరో అపశకునమే.
తెలంగాణలో కేసీఆర్ జాతకాన్ని చూసి ఇక్కడ ఏపీలో వైసీపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్చుతుండటం అన్నిటికంటే పెద్ద అపశకునంగానే కనిపిస్తోంది.
జగనన్న సందించిన బాణం వైఎస్ షర్మిల నేడో రేపో ఢిల్లీ నుంచి దూసుకు రాబోతున్నారు. ఇది కూడా వైసీపికి అపశకునంగానే కనిపిస్తోంది. ఆమె వైసీపికి పక్కలో బల్లెంలా దిగబడబోతున్నారు. ఎంతకాదనుకొన్నా, ఆమె జగన్‌కు స్వయాన్న చెల్లెలే. కనుక సజ్జల, అంబటి, రోజా, కొడాలి, గుడివాడ, సీదిరి వంటి ‘వైసీపి పండితులు’ ఎవరూ ఆమెను గట్టిగా ఒక్క మాట అనలేకపోవచ్చు. కానీ అనకపోయినా ఇబ్బందే. కనుక వైఎస్ షర్మిలని వైసీపి నేతలు ఏవిదంగా ‘హ్యాండిల్’ చేస్తారో చూసి తీరాల్సిందే.
ఏపీకి ఆమె రాకను ఇంకా కాంగ్రెస్ ఖరారు చేయనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె.శివ కుమార్ ఖరారు చేసిన్నట్లే భావించవచ్చు. బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం బహుశః అదే సూచిస్తున్నట్లు భావించవచ్చు.
ఇటీవల ఎన్నికల వ్యూహ నిపుణుడు ఉండవల్లి వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఇవన్నీ యాదృచ్ఛికమని సరిపెట్టుకోవడానికి లేదు. ఇవన్నీ ఖచ్చితంగా వైసీపికి అపశకునాలే.
కానీ వీటన్నిటినీ చంద్రబాబు నాయుడికి ఆపాదించి ఆయన అసమర్దతగా వర్ణిస్తూ ఆత్మసాక్షి శల్యసారధ్యం చేస్తుంటే టిడిపి, జనసేనలు మాత్రం వద్దంటాయా?




