టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెలరోజులు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రెండు మూడు రోజుల నుంచి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. బరువు కూడా తగ్గారని జైలు అధికారులే చెపుతున్నారు. ఇప్పుడు ఆయన ఒంటిపై దద్దుర్లు ఏర్పడ్డాయి. ఆయన చర్మ సంబందిత అలర్జీతో బాధపడుతున్నారని జైలు ఇన్‌చార్జి రాజ్‌కుమార్ చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఆందోళన అవసరం లేదని చెప్పారు.
కానీ జైళ్ళ శాఖ సూపరింటెండెంట్ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెట్ డాక్టర్ ఎం. లక్ష్మీ సూర్యప్రభకు నిన్న వ్రాసిన లేఖలో చర్మ సంబందిత సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి అత్యవసరంగా చికిత్స అందించాలని కోరుతూ, దీనిని ‘మోస్ట్ అర్జంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రత విషయంలో ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొన్ని వారాల క్రితం ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న 19 ఏళ్ల యువకుడు డెంగీ జ్వరంతో చనిపోయాడు.
టిడిపిని అడ్డుతొలగించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని కూడా అడ్డు తొలగించుకోవడానికే అరెస్ట్ చేసి డెంగీ దోమలున్న జైల్లో వేసిందని నారా లోకేష్ మొదటే అనుమానం వ్యక్తం చేశారు. తద్వారా తమను ఎవరూ వేలెత్తి చూపకుండా జగన్ జాగ్రత్తపడ్డారని నారా లోకేష్ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఏమాత్రం అనారోగ్యం పాలైనా కోలుకోలేరని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఆయన భద్రతపై కూడా టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టిడిపి నేతలు భయపడుతున్నట్లే, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లే చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళుగా జిల్లా పర్యటనలు చేస్తున్నా ఏనాడూ ఆయన అనారోగ్యం పాడవలేదు. కానీ జైల్లో వేసిన నెలరోజులకే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి! చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన అవసరం లేదని చెపుతూనే, అత్యవసరంగా ఆయనకు చికిత్స అవసరమని జైళ్ళ శాఖ సూపరింటెండెంట్ వైద్యులకు లేఖ వ్రాయడాన్ని ఏమనుకోవాలి?
చంద్రబాబు నాయుడి అరెస్టు, ఈ కేసులతో తనకు సంబందం లేదని జగన్ చెప్పేశారు కనుక ఆయన భద్రతకు, ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మంత్రులా? అధికారులా? వైద్యులా?




