జగన్‌కు 2.0పై ఇంత నమ్మకం… టీడీపి మేల్కోవాల్సిందే!

రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీని పట్టించుకోలేదనే చెప్పాలి. అమరావతి నిర్మాణానికి ప్లాన్ చేసుకోవడంపైనే దృష్టి పెట్టేవారు. ఆ తర్వాత బిజేపితో విభేదాలు రావడంతో మిగిలిన పుణ్యకాలం ఆ గొడవలతో సరిపోయింది.

కనుక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వేచ్చగా రాష్ట్రంలో తిరుగుతూ సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ, పాదయాత్ర చేసుకున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు కనీసం వాటినీ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ADVERTISEMENT

2019 ఎన్నికలలో వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు, టీడీపి ముఖ్యనేతలకు రాజకీయ వేధింపులు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు వాటికి పరాకాష్ట.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌.. వైసీపీ జోలికి వెళ్ళకపోయినా, ఆయనని దెబ్బ తీసి టీడీపిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని జగన్‌ విశ్వప్రయత్నాలు చేశారు.

చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటారని వైసీపీ నేతలే భయపడ్డారు.

కానీ అయన ఓ రెండు మూడు పెద్ద కేసులు బయటకు తీసి,వారి మెళ్ళో పడేశారు తప్ప, జగన్‌తో సహా వైసీపీ ముఖ్య నేతలు ఎవరిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు.

దీంతో మొదట్లో రెడ్ బుక్ చూసి భయపడిన వైసీపీ నేతలే ఇప్పుడు రోడ్లపైకి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రి నారా లోకేష్‌ని ధైర్యంగా దూషిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి అరాచాకాలు చేస్తున్నారు.

అంటే తమ పట్ల సిఎం చంద్రబాబు నాయుడు నేటికీ మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారన్న మాట! కానీ ఇది ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటం.. అని చెప్తే అందరూ నవ్వుతారు.

ఈ వైఖరిని కూడా జగన్‌ సహించలేన్నట్లు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుండటం విస్మయం కలిగిస్తుంది. నాడు జగన్‌, వైసీపీ జోలికి చంద్రబాబు నాయుడు వెళ్ళనప్పుడే అంతగా వేధించారు.

గుంటూరు శాప్ వంటి ఘటనలతో కవ్విస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు సంయమనం కోల్పోవడం లేదు. కానీ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నవారిపై చట్టబద్దంగా చర్యలు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు.

కానీ వాటినీ సహించలేక జగన్‌ మరింత ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్‌ ఏ నమ్మకంతో చెపుతున్నారో తెలీదు కానీ అప్పుడు ‘జగన్‌ 2.0’ మామూలుగా ఉండబోదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా మాట్లాడుతూ, వ్యవహరిస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏవిధంగా వ్యవహరిస్తారో ఊహించుకోవచ్చు.

వైసీపీ మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. కానీ వస్తే మాత్రం ప్రతీకార రాజకీయాలు మామూలుగా ఉండబోవని ఇప్పుడే స్పష్టమవుతోంది.

వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ ఓడిపోతే పార్టీ మరింత బలహీన పడటం తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. కానీ కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపికి వచ్చే ఎన్నికలలో గెలవడం తప్పనిసరి. లేకుంటే కలిగే కష్టం, నష్టం మామూలుగా ఉండదు.

కనుక చంద్రబాబు నాయుడు ఇదివరకు చెప్పునట్లే పాలనతో పాటు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టి పనిచేయడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories