ఇది వరకు వైసీపీ హయంలో వరుస పెట్టి సంక్షేమ పధకాలు అమలు చేశారు. వాటి కోసం బటన్ సభలు, మీడియా ప్రకటనలు, ఫ్లెక్సీ బ్యానర్లు వగైరాలన్నీ యధావిధిగా జరిగిపోతుండేవి. కానీ లక్షల కోట్లు పంచి పెట్టినా జనాలు జగన్‌ని తిరస్కరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నారు కాకపోతే… చాలా భిన్నంగా!
ఇదివరకు 1వ తేదీ తెల్లవారు జామున 5 గంటలకు వాలంటీర్లు ఇంటి తలుపులు తట్టి షిక్కటి షిర్నవ్వులతో పించన్లు ఇచ్చివారని జగన్ సగర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు చెప్పుకోవడం మానేశారు!
ఎందువల్లనంటే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతీనెల ఒక్కో ఊరిలో లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా పించన్లు అందజేసి వారి యోగక్షేమాలు కనుక్కొంటున్నారు! నాడు జగన్ ప్రజల మధ్యకు వెళ్ళాలంటే అనేక ముందస్తు ఏర్పాట్లు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి హడావుడీ లేకుండానే నేరుగా గ్రామ ప్రజల వద్దకు వెళ్ళిపోతున్నారు.
వాలంటీర్ల కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రజలకు సంబంధాలు తెగిపోగా, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో సంబంధాలు బలపరుచుకుంటున్నారు. అందరూ అయన బాటలోనే నడుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పధకమే.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, చివరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా మూడు పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతలు అందరూ కాకీ చొక్కాలు ధరించి ఆటోలలో ప్రయాణించి సభా వేదికలకు చేరుకున్నారు.
ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులతో సరదాగా కబుర్లు చెప్పారు. చెపుతుండగానే అందరి ఖాతాలలో రూ.15,000 చొప్పున జామా అయ్యాయి.
బటన్ నొక్కి పేపర్లో ప్రకటనలు వేసుకోవడానికి, నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి ఎంత తేడా ఉందో తెలుస్తూనే ఉంది. తాము వాలంటీర్లు, ఐ ప్యాక్ పెట్టుకొని ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని ఇంత కాలం వైసీపీ భ్రమలో ఉండేది.
కానీ అవేమీ లేకుండానే అంతకంటే చాలా గొప్పగా, ముఖ్యంగా ప్రజల మనసులు గెలుచుకునేలా కార్యక్రమాలు ఎలా నిర్వహించవచ్చో సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమం, పధకంపై విమర్శలు చేసే వైసీపీ నేతలు, పించన్ల చెల్లింపు, ఇప్పుడీ ఆటో డ్రైవర్ల సేవలో పధకంపై నోరెత్తి మాట్లాడలేకపోవడానికి కారణం ఇదే!
కూటమిలో నేతలు గొడవలు పడి విడిపోయి తమ ప్రభుత్వాన్ని కూలద్రోసుకుంటారని వైసీపీ అనుకుంటే, మూడు పార్టీల నేతలు సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని శ్రీరాముడి ఆజ్ఞలా పాటిస్తుండటం ఇంత ఐక్యత ప్రదర్శిస్తుండటం బహుశః జగన్ కూడా ఊహింఛి ఉండరు.
కనుక మూడు పార్టీలు ఇలాగే కలిసికట్టుగా పని చేస్తుంటే, ప్రజలు మళ్ళీ వాటికే మొగ్గు చూపుతారు తప్ప తమకు కానే కాదని వైసీపీకి ఇప్పటికైనా అర్ధం అయ్యిందో లేదో?







