పంచాయతీ ఎన్నికల తరువాత చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో కుప్పం నుండి ఓడిపోవడం ఖాయం.. ఆయన ఇంకో నియోజకవర్గం వెతుక్కోవాల్సిందే అంటూ ఊదరగొట్టారు అధికారపక్ష నేతలు. ఆ తరువాత చంద్రబాబు రోడ్ షోలో ఎవరో ఒకరిద్దరు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుని రామన్నటే… దాని గురించి హడావిడి చేసింది సాక్షి.
ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని సాక్షి వార్తలు వడ్డి వార్చింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి వేరేగా ఉండటం గమనార్హం. చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా ధర్నా చెయ్యడానికి చిత్తూరు వచ్చారు చంద్రబాబు.
అయితే పోలీసులు ఆయన్ని ఎయిర్ పోర్టు నుండి బయటకు వెళ్లనియ్యకుండా చంద్రబాబును అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు. కోవిడ్ కారణంగా చూపుతూ… అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి వీలుపడదు అంటూ ఆయనకు పర్మిషన్ ఇవ్వకపోవడం గమనార్హం.
“ఇక చంద్రబాబు పని అయిపోయింది… ఆయన సొంత నియోజకవర్గం లోనే ఓడిపోవడం ఖాయం అంటూ బీరాలు పలికిన నేతలు ఇప్పుడు ఆయన పర్యటన అంటే ఎందుకు భయపడుతున్నారు? అధికారంలో లేని చంద్రబాబు ని చూసి కూడా భయపడుతున్నారా? అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు రాని కరోనా చంద్రబాబు వస్తేనే వస్తుందా?,” అంటూ టీడీపీ వారు విమర్శిస్తున్నారు.





