నీ పర్మిషన్ మాకు అవసరమా … జగన్?

Chandrababu-Naidu-Press-Meet-టిడిపి హయాంలో కేంద్రం నుంచి అనుమతులు సాధించి, భూసేకరణలు చేసి శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు నాలుగేళ్ళ తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శంకుస్థాపనలు చేస్తుండటంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిశిత విమర్శలు చేశారు. మంగళగిరిలో టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పనులను నిలిపివేసి ‘రివర్స్ టెండరింగ్’ అంటూ రివర్స్ పరిపాలన ప్రారంభించారు. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా మా హయంలో వచ్చినవాటిని బెదిరించి తరిమేశారు. జగన్‌ తీరు చూసి రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు కూడా వెనక్కుపోయాయి. రాష్ట్రంలో పరిశ్రమలు నడిపించుకోవాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేసి బేరసారాలు చేసుకొన్నారు. బేరాలు కుదిరినవాటికే ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. నాలుగేళ్ళలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా మేము శంకుస్థాపన చేసినవాటికే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ మరో రెండేళ్ళలో…. మరో మూడేళ్ళలో ఏపీ ఇంత అభివృద్ధి చెందుతుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు,” అని అన్నారు.

“గత నాలుగేళ్ళలో దేశం మొత్తానికి రూ.13,42,389 కోట్లు పెట్టుబడులు వస్తే, తన మొహం చూసి ఈ ఒక్క ఏడాదిలోనే ఒక్క ఏపీకి రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని జగన్‌ నమ్మబలుకుతున్నారు. కానీ వాస్తవానికి ఈ నాలుగేళ్ళలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.5,751 కోట్లు మాత్రమే. ఐ‌టి రంగాన్ని తెలుగువారే శాశిస్తున్నారు. కానీ ఏపీలో ఐ‌టి రంగం ఎంత దయనీయంగా ఉందో అందరూ చూస్తునే ఉన్నారు. ఈ నాలుగేళ్ళలో ఐ‌టి రంగంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 0.1 శాతం మాత్రమే,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT

“భోగాపురం విమానాశ్రయం కొరకు మేము 2,700 ఎకరాలు సేకరిస్తే వాటిలో 2,200 ఎకరాలు మాత్రమే విమానాశ్రయానికి ఉపయోగిస్తామని చెపుతున్నారు. అంటే మిగిలిన 500 ఎకరాలు నొక్కేద్దామని చూస్తున్నారా?భావనపాడు, బందరు పోర్టు ఇలా ప్రతీ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చుకొని భూసేకరణ చేసి పెడితే ఆ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ శంకుస్థాపన చేస్తారా?ఎవరిని మభ్యపెట్టడానికి?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

టిడిపి-జనసేనల పొత్తుల గురించి జగన్‌తో సహా మంత్రులు చేస్తున్న కామెం ట్స్‌పై కూడా చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా స్పందించారు. “ఏం మేము పొత్తుల కోసం నీ పర్మిషన్ తీసుకోవాలా?నువ్వు నాకు రాజకీయాలు నేర్పిస్తావా? పవన్‌ కళ్యాణ్‌, నేను సమావేశమైతే మద్యలో మీకెందుకు అంత ఆందోళన?మా పొత్తుల గురించి మీకెందుకు అంత ఆతృత?ఓడిపోతామనే భయం వల్లనే కదా?మా గురించి ఆలోచించేబదులు ముందు మీ పార్టీని చక్కబెట్టుకో… ఇప్పటికే ఓ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు వచ్చే ఎన్నికలలో పోటీ చేయమని ముందే చెప్పేస్తున్నారు. నీతో వేగలేక ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగిలినవారిపై నమ్మకం లేక నువ్వు సస్పెండ్ చేసుకొంటావు లేదా మంత్రి పదవులు ఊడబెరికి పక్కన కూర్చోబెడుతుంటావు. వైసీపీ పాలనతో వేసారిపోయున్నారు ప్రజలు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘోరపరాజయం పొందబోతోంది,” అని అన్నారు.

తనను జైలుకి పంపిస్తానంటూ సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడంపై స్పందిస్తూ, “నాలుగేళ్ళుగా ఏం పీకారు? కొండను తవ్వి ఎలుకని పట్టారు. మాలో ఏ ఒక్కరిపైనైనా అవినీతి ఆరోపణలు నిరూపించగలిగారా?మీరు నన్ను జైలుకి పంపించడం కాదు… ముందు మీ అధినేత జగనే జైలుకు పోకతప్పదు. అతనిపై 11 సీబీఐ కేసులున్నాయి. 9 ఈడీ కేసులున్నాయి. వివేకా హత్య కేసు ఉండనే ఉంది. ఇవికాక ఈ నాలుగేళ్ళలో చేసిన అక్రమాలు, అవినీతిపై భవిష్యత్‌లో మరిన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకొంటే, ఇక శాస్వితంగా జైలులో చిప్పకూడు తినాల్సివస్తుంది. ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories