టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సాధారణంగా తనంతట తానుగా ఎవరి జోలికి పోరు. తనపై ప్రత్యర్ధులు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా కూడా వెంటనే ఆవేశంతో మాట జారకుండా సంయమనం పాటిస్తుంటారని అందరికీ తెలుసు.
అందుకే ఆయన ఇబ్బంది పడుతుంటారని, కానీ తాను మాత్రం మాటకి మాట… రాయికి రాయి అన్నట్లు వ్యవహరిస్తుంటానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెప్పడం అందరూ వినే ఉంటారు.
నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు నిగ్రహించుకొంటే, నాలుగేళ్ళ జగన్ పాలనలో వేధింపులు, అవహేళనలతో నారా లోకేష్ రాటు తేలిపోయారని చెప్పవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, కేసీఆర్ (బిఆర్ఎస్) ఓటమిపై చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. కానీ అప్పుడూ నోరు జారలేదు. మాట తూల లేదు.
శుక్రవారం తెనాలి నియోజకవర్గంలోని నండివెలుగులో తుఫాను వలన దెబ్బతిన్న పంటలను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తుఫాను వల్ల కంటే మానవ తప్పిదం వలననే ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. తుఫాను తీవ్రత గురించి ముందుగానే వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలననే గ్రామాలలో నష్టం తీవ్రత పెరిగిందన్నారు.
“నేను తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రైతులను పరామర్శించేందుకు బయలుదేరుతున్నానని ప్రకటించే వరకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాలేదు. నేను బయలుదేరగానే ఆయన హడావుడిగా బయలుదేరారు. ప్రజలకు, రైతులకు కష్టం వచ్చినప్పుడు వచ్చి ఆదుకోని ముఖ్యమంత్రి ఉండి ఏం ప్రయోజనం?
ఒకవేళ జగన్ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే మూడు నెలల తర్వాత మేము అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కరికీ నష్టపరిహారం చెల్లిస్తాము. జగన్ ప్రభుత్వం చాలా అహంకారంతో విర్రవీగుతోంది. ఇలా విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణలో చూశాము కదా?” అని అన్నారు.
తెలంగాణను కేసీఆర్ ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ ఆయన అహంకారమే బిఆర్ఎస్ పార్టీకి శాపంగా మారిందని అందరూ చెపుతున్నారు. జగన్ అహంకారం వలన వైసీపికి కూడా ఆదేగతి పడుతుందని చంద్రబాబు సున్నితంగానే హెచ్చరించారు. అయితే వైసీపిలో పైనుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వరకు అందరిలోనూ ఈ అహంభావం వ్యాపించిపోయింది. ఇది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది కూడా. కనుక వైసీపి ఓటమి ఖాయమనే భావించవచ్చు.






