ఇటీవల జరిగిన అనంతపురం సభలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలతో కూడిన సలహాలను పవన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యేక హోదాలో ప్యాకేజ్ ను ఎలా అంగీకరించారని, టిడిపి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ప్రజలు బాగా చెప్పుకుంటున్నారని, దానిని సరిచేసుకునే విధంగా పాలన సాగించాలని హితవు పలికారు. ఎంత మిత్ర రాజకీయ పక్షమైనా, బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే… వాటిని స్వీకరించే దిశలో ప్రస్తుత రాజకీయ నాయకులు లేరన్న విషయం తెలిసిందే.
మరి ‘జనసేన’ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఏమన్నారో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. బహిరంగంగా ఆరోపణలు చేసిన పవన్ ను విమర్శించడం మాట దేవుడేరుగు, పవన్ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయమేనని, అందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకురావడం విశేషం. వేల కోట్ల రూపాయల ఆర్ధిక లోటుతో ఆవిర్భవించిన రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పడానికే రెండున్నర్రేళ్ళు పట్టిందని, ఆ నిధులివ్వడానికి మరో రెండున్నర్రేళ్ళు పడితే దేనికి ఉపయోగం అని, ఇదే పవన్ ప్రశ్నించారని, ‘జనసేన’ అధినేత వ్యాఖ్యలను సమర్ధించారు.
అవసరమైనపుడు నిధులు రాకుండా, పుణ్యకాలం గడిచిన తర్వాత నిధులు వస్తే ఎవరికి ఉపయోగం అని, సకాలంలో రాష్ట్రానికి నిధులు అందితేనే సమస్యలను పరిష్కరించగలమని, ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని అభిప్రాయ పడ్డారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను పరిశీలిస్తే… పవన్ తో ఏ మాత్రం విభేదాలు రావడానికి ఆస్కారం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా కేంద్రం విషయంలో పవన్ వ్యాఖ్యలను చంద్రబాబు బలపరిచినట్లుగా కనపడుతోంది.



