Chandrababu Naidu Vizag Investments

రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అనేక సమస్యలను, సంక్షోభాలను పరిష్కరించాల్సివచ్చింది. అనేక సవాళ్ళు ఎదుర్కొంటూనే అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఎన్నికల హామీలను అమలుచేయాల్సి వచ్చింది.

Also Read – ఆ విషయంలో జగన్‌ కంటే ప్రశాంత్ కిషోరే బెటర్

ఒకవేళ చంద్రబాబు నాయుడు స్థానంలో జగన్‌ అప్పుడే ముఖ్యమంత్రి అయ్యుంటే కనీసం నెలరోజులైనా ఆ కుర్చీలో కూర్చోగలిగేవారా?అనే సందేహం కలుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ఏవిదంగా ముందుకు సాగారో అందరికీ తెలుసు.

చంద్రబాబు నాయుడు వడ్డించిన విస్తరిలాంటి ఆంధ్రప్రదేశ్‌ని జగన్‌ చేతిలో పెడితే, 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతికే అప్పగించి దిగిపోయారు.

Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?

కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి మళ్ళీ మొదటి నుంచి అన్నీ సరిచేసుకోక తప్పడం లేదు. జగన్‌ అన్ని వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించేయడంతో దాదాపు రెండు నెలలుగా ఆ మురికిని శుభ్రం చేస్తున్నా ఇంకా ఆ కంపు వదలడం లేదని టిడిపి మంత్రులు చెపుతున్నారు.

ఓ పక్క వ్యవస్థలని శుభ్రం చేస్తూనే పాలన సజావుగా సాగేలా చూసుకోవాలి. సకాలంలో జీతాలు, పింఛన్లు అందించాలి. అమరావతి, పోలవరం పనులను పునః ప్రారంభించాలి. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చుకుంటూ ఉండాలి.

Also Read – కేజ్రీవాల్‌ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేస్తున్నారంటూ వైసీపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కోవలసి ఉంటుంది.

జగన్‌ హయాంలో వైసీపి నేతలు, వారి కనుసన్నలలో పనిచేసిన ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ ఎంత మేసేశారో… ఏమేమి ఫైల్స్ తగులబెట్టేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇన్ని పనులు, ఈ ఒత్తిళ్ళు సరిపోవన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడుపై టిడిపి శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా వైసీపి నేతలపై కటిన చర్యలు తీసుకోకుండా సిఎం చంద్రబాబు నాయుడు వారిపట్ల మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీలో నేటికీ వైసీపి నేతల హవా కొనసాగుతోందని, పెద్దిరెడ్డి సిఫార్సు లేఖలతో వస్తున్న వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తూనే ఉన్నారని కొందరు ఆరోపిస్తుంటే, మా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందంటూ టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ని ఒత్తిళ్ళ మద్య సిఎం చంద్రబాబు నాయుడు సజావుగా పాలన చేయాలి. అమరావతి, పోలవరం పనులు పరుగులు పెట్టించాలి. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మళ్ళీ అభివృద్ధి చేయాలి… అని ప్రజలు ఆశిస్తున్నారు.




చంద్రబాబు నాయుడు కూడా ఏమాత్రం అధైర్య పడకుండా అన్నీ చేసి చూపిస్తానని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెపుతున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం, దూరదృష్టే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శ్రీరామరక్ష!