టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ల కోసం అసమ్మతి రాగాలు ఆలపిస్తున్నవారికి గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో ఎవరికైనా టికెట్ల విషయంలో ఏదైనా సమస్య లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే వచ్చి తనతో మాట్లాడవచ్చు కానీ మీడియా ముందుకు వెళ్ళి బహిరంగంగా మాట్లాడితే మాత్రం పార్టీని వీడాలనుకొంటున్నవారిగానే పరిగణించి చర్యలు తీసుకొంటానని స్పష్టంగా చెప్పారు. పార్టీలో ఎంత సీనియర్లు అయినప్పటికీ అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నంతవరకే గౌరవం, మర్యాద లభిస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీలో వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం. అందరూ కలిసి పార్టీని కాపాడుకొంటేనే, పార్టీ వారిని కాపాడుతుందని అన్నారు. టికెట్ల విషయంలో పార్టీకి ఏది మంచిదో అదే చేస్తాము తప్ప ఎవరో నొచ్చుకొంటున్నారనో లేదా ఎవరినో మెప్పించడానికో నిర్ణయాలు తీసుకోలేమని చంద్రబాబు నాయుడు నిష్కర్షగా చెప్పారు.
చిలకలూరిపేటలో యువనాయకుడు భాష్యం ప్రవీణ్‌కు టికెట్ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కనుక ప్రతిపాటి పుల్లారావు స్పందిస్తూ “అసలు ఈ ప్రవీణ్ ఎవరు? ఆయనకు ఇక్కడ ఓటే లేదు. చిలకలూరిపేటలో ఆయనకు పనేమిటి?ఈ హడావుడి, ప్రచారం దేనికి?ఇలా కొత్తగా వచ్చినవారు ఫౌండేషన్లు, సామాజిక సేవలంటూ హడావుడి చేసి పార్టీకి ఓ పదిలక్షలు విరాళం ఇచ్చి, మరో పదో, పాతికవేలో ఖర్చు చేసి నలుగురికి సైకిళ్ళు, పుస్తకాలు పంచిపెడితే సరిపోతుందా?ఇవాళ్ళ ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినవారు రేపు ఎన్నికలలో పోటీ చేసేందుకు తగినంత డబ్బు లేదని చేతులు ఎత్తేస్తారు. కనుక ఇలాంటివారి విషయంలో పార్టీ జాగ్రత్తగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడుతాను,” అని అన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంపీ టికెట్ కోసం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేశినేని నానికి, సత్తెనపల్లి టికెట్ కోసం పట్టుబడుతున్న కొడాలి శివరామ్‌కు, చిలకలూరిపేట నుంచి పోటీ చేయాలనుకొంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మొహమాట పడకుండా వార్నింగ్ ఇచ్చేశారు. అయినా వారు ఇలా మీడియా ముందుకు వచ్చి పార్టీకి నష్టం కలిగించేలా అసమ్మతిరాగాలు ఆలపిస్తే ఏం జరుగుతుందో కూడా చంద్రబాబు నాయుడు చెప్పేశారు. కనుక ఇప్పుడు బంతి వారి కోర్టుల్లోనే ఉంది. వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న టిడిపిని అంటిపెట్టుకొని ఉండి లాభపడతారో, టికెట్ కోసం వైసీపీనో, బిజెపినో నమ్ముకొని మునుగుతారో ఇక వారిష్టం!



