ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత అనుచితంగా మాట్లాడుతున్నా, రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించినా ఏనాడూ వారిని ఉద్దేశ్యించి పరుషంగా మాట్లాడలేదు. కనీసం స్పందించడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది తొలిసారిగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మరీ తెలంగాణ నేతల తీరుని తప్పు పట్టారు.
రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా ఇంకా ఈ విద్వేషం దేనికో నాకు అర్థం కాదు. మన రాజకీయాల కోసం రెండు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చుపెట్టడం సరికాదు.
తెలంగాణ ఏర్పడక మునుపు ఆ ప్రాంతాన్ని ఎవరు ఎంతగా అభివృద్ధి చేశారో అక్కడున్న ప్రజలకు బాగా తెలుసు. కనుక అక్కడి నుంచి ఆ అభివృద్ధిని మునుకు కొనసాగించుకుంటూ పోవాలి తప్ప ప్రజలను రెచ్చగొడుతూ విద్వేషాలు రాజేయడం సరికాదు.
మన తెలుగు వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంకా యూరప్‌లోని చాలా దేశాలలో ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేస్తూ, తమ సమర్దత నిరూపించుకొని అక్కడి ప్రభుత్వాలలో ఉన్నత పదవులలో ఉన్నారు.
విదేశాలలో మనవాళ్ళు ఉండటం, అక్కడ ఉన్నత పదవులు చేపట్టడం తప్పు కానప్పుడు పుష్కర కాలం క్రితం వరకు ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఎందుకీ విద్వేషాలు?
ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో విస్తరించాలని కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైనా అభ్యంతరం చెప్పామా? లేదు కదా?
ఇటీవల తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు నేను కూడా అక్కడకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశాను. దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్, బిజేపి నేతలు కూడా వచ్చి ప్రచారం చేశారు. అందుకు తమిళనాడులో పార్టీలు, ప్రజలు ఎవర్నీ తప్పుపట్టలేదు. కానీ తెలంగాణలోపార్టీలు, నాయకులే ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు. రాజకీయాలు చేసుకోవచ్చనే కదా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకు ఆయనపై అందరూ విరుచుకుపడటం దేనికి?అని సిఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, టీడీపి నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధీటుగా ఎదుర్కొని పోరాడారు. కనుక వారు బీఆర్ఎస్ నేతల విమర్శలు, వెక్కిరింతలకు సమాధానం చెప్పలేరని ఎలా అనుకున్నారు? సిఎం చంద్రబాబు నాయుడు సంయమనం పాటిస్తున్నారు కనుక సరిపోయింది. అదే అయనతో సహా టీడీపి, జనసేన నేతలు మాటకు మాట బదులిస్తూ రాజకీయాలు చేస్తే ఏమయ్యేది? ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు అగ్నిగుండంలా రగులుతూనే ఉండేవి కదా?
కనుక ఏపీ మౌనాన్ని చాతకనితనంగా భావించి మాట్లాడితే నిన్న పవన్ కళ్యాణ్ నిలదీసినట్లే నిలదీయగలరని గ్రహిస్తే మంచిది.
అయినా గొప్ప మేధావుల పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించలేకపోతే అందుకు సిగ్గుపడాలి. కానీ మళ్ళీ ఆంధ్రావాళ్ళు, సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో రాజకీయంగా పైచేయి సాధించాలనుకోవడం సిగ్గుచేటు అని అనిపించడం లేదా?




