వాయిదాలతో ముందుకెళ్తున్న న్యాయస్థానాలు, నిరుత్సాహంతో వెనక్కివెళ్తున్న టీడీపీ శ్రేణులు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని మూడు వారాలుగా రాజమండ్రి జైల్లో మగ్గుతున్న బాబుకి ఇప్పట్లో మోక్షం దొరికేలా లేదు. హైకోర్టులో చుక్కెదురైన బాబుకి సుప్రీకోర్టులో అయినా ఉపశమనం దక్కుతుందేమో అని ఎదురుచూస్తున్న టీడీపీ తమ్ముళ్లకు మళ్ళీ నిరాశలే ఎదురయ్యింది.
సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బాబు క్వాష్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈకేసులో 17A అమలు కాలేదని బాబు తరుపు న్యాయవాదులు వాదించగా ఈ కేసుకి 17A సంబంధం లేదని ప్రభుత్వ తరుపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు.
ఈ కేసుకు సంబందించిన అన్ని పత్రాలను కోర్ట్ ముందు హాజరుపర్చాలని న్యాయముర్తులు సిఐడిని ఆదేశించగా అందుకు తమకు కొంత గడువు కావాలని ఏపీ సిఐడి బృందం న్యాయమూర్తులు కోరగా అందుకు ధర్మాసనం వారం రోజుల గడువు మంజూరు చేశారు. దీనితో బాబు క్వాష్ పిటిషన్ మీద విచారణ మరో సోమవారానికి వాయిదా పడింది.ఇలా న్యాయస్థానాలు వాయిదాలతో ముందుకెళ్తున్నాయి. న్యాయస్థానాల వాయిదాలతో టీడీపీ శ్రేణులు వెనక్కెళ్తున్నారు.
ఆధారాలతో బాబు అడ్డంగా దొరికిపోయారు అంటూ గొంతు చించుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మరి ఆధారాలు చూపడానికి ధర్మాసనం వద్ద సమయం అడగడంలో ఉన్న మర్మమేమిటో అంతా ఆ జగన్నాధుడికే తెలియాలి మరి.! ఆధారాలు చూపడానికా? లేక బాబుని మరికొంత కాలం జైలులో ఉంచి టీడీపీ పార్టీని దెబ్బకొట్టడానికా? ఈ వాయిదాల పర్వం.



