తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీడీపీ మద్దతుదారులతో, చంద్రబాబు అభిమానులలో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి. అయితే వీరి ఆనందానికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం దక్కించుకోవం కాదు, బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గద్దె దిగడమే అనేది సుస్పష్టం.
అయితే ఇక్కడ బాబు అభిమానులు సంబరాలు చేసుకోవడానికి మరో కారణం కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష్యుడు, తెలంగాణకు కాబోయే సీఎం గా చెప్పబడే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడమే. 2018 తెలంగాణ ఎన్నికలలో టీడీపీ పార్టీ పోటీ చేసినప్పుడు కేసీఆర్ అతని పార్టీ నేతలు టీడీపీ పార్టీ మీద అలాగే చంద్రబాబు పైన అత్యంత దారుణమైన విమర్శలు చేసి తెలంగాణలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేశారు.
దాదాపుగా తెరాస పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ తెలంగాణ టీడీపీ పార్టీ నాయకులే. 2023 తెలంగాణ ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ పడిన కేసీఆర్ – రేవంత్, “ఓడిపోయినవాడు – ఓడించినవాడు” ఇద్దరు నేతలు కూడా టీడీపీ పార్టీ సభ్యులు, బాబు శిష్యులే కావడం ఇక్కడ గమనార్హం. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రాగానే చేసిన మొదటి పని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం. “పార్టీ మారు పదవి పట్టు” అన్నట్టుగా పక్క పార్టీ నేతలందరినీ కారెక్కించి పార్టీ మోయలేనంత బరువు పార్టీ మీద వేశారు.
తెలంగాణ సెంటిమెంట్ అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో మరో పార్టీని ఎదగకుండా, మరో నాయకుడిని పుట్టకుండా ఆపాలని చూసిన కేసీఆర్ కు రేవంత్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటే సహించలేని కేసీఆర్ ఏపీ రాజకీయాలలో మాత్రం తన పంతం నెక్కించుకోవడాని, బాబుని ఓడించడానికి జగన్ కు మద్దతుగా ఒకరకంగా చెప్పాలంటే జగన్ కు పెద్దన్న గా మారి ఏపీలో చేసిన రాజకీయంతో ఎక్కువగా నష్టపోయింది టీడీపీ పార్టీ.
దీని ఫలితంగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని అవమానాలు, అవహేళనలు, అపనిందలు, విమర్శలు, ఎదురుదెబ్బలు, ఎన్నో ఎదుర్కొన్నారు బాబు.చివరికి తన భార్య నారా భువనేశ్వరికి తప్పని రాజకీయ విమర్శలతో బాబు ఎన్నడూ లేని విధంగా భావోద్వేగానికి గురయ్యి కంటతడి కూడా పెట్టారు.అలాగే బాబు సామజిక వర్గం పేరు చెప్పి జగన్ ఏకంగా రాష్ట్ర రాజధాని అమరావతిని సజీవ దహనం చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా జగన్ కులం ఆధారంగా ప్రజలను, ప్రాంతాలను విడగొడుతూ, చివరికి ఆధారాలు లేని కేసు మోపి బాబుని జైలుకు పంపడం కూడా చేశారు. ఇదంతా జరగడానికి, జగన్ కు ఇంత బలం పెరగడానికి కారణం ఒకరకంగా కేసీఆర్ అక్కడి ప్రభుత్వం.మరో కొన్ని నెలలలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. ఒకేవేళ గతం మాదిరిగానే తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్ తో తెర వెనుక రాజకీయ మొదలుపెట్టి టీడీపీ ని దెబ్బకొట్టే ప్రయత్నం చేయడం కాయం.
కానీ ఆ తెరచాటు రాజకీయాలకు ఇప్పుడు రేవంత్ చెక్ పెట్టడంతో టీడీపీ మద్దతుదారులలో, బాబు అభిమానులలో ఆనందం రెట్టింపయ్యింది. తెలంగాణలో కేసీఆర్ గద్దె దిగడంతో వైసీపీ నాయకులలో ఓటమి భయం మొదలవుతుంది. రేవంత్, బాబుకి విధేయుడు కాబట్టి తెలంగాణను అడ్డుపెట్టుకుని జగన్ చేస్తున్న రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉండడంతో బాబు ఫాన్స్ సెలబ్రేషన్స్ షురూ చేశారు.




