సూపర్ సిక్స్ ఎందుకు?ఎలా?ఇదిగో చంద్రబాబు జవాబు

Chandrababu Naidu Super Six

ఇంతకాలం సంక్షేమ పధకాలంటే వైసీపి పేరు వినబడుతుండేది. కానీ టిడిపి, జనసేనల మ్యానిఫెస్టోలో ‘సూపర్ సిక్స్’ పేరుతో అంతకు మించి అద్భుతమైన పధకాలను ప్రకటించింది.

గత ఐదేళ్ళుగా ఈ పధకాల పేరుతో ప్రజలకు సొమ్ము పంచిపెడుతూ ఓటు బ్యాంకు నిర్మించుకున్నప్పుడు వైసీపిలో ఎవరికీ అది తప్పుగా కనిపించలేదు. పైగా బటన్ నొక్కి సంక్షేమ పధకాలతో మేలు చేస్తున్నామని నేటికీ జగన్‌తో సహా వైసీపిలో అందరూ చెప్పుకొని అందుకు ప్రతిగా తమకే మళ్ళీ ఓట్లు వేయాలని అడుగుతున్నారు.

ADVERTISEMENT

కానీ టిడిపి, జనసేనల సూపర్ సిక్స్ సంక్షేమ పధకాలను తప్పు పడుతున్నారు. మా సంక్షేమ విధానాన్ని తప్పు పట్టిన టిడిపి, జనసేనలు ఇప్పుడు సంక్షేమ పధకాలు ఎందుకు ప్రకటించాయి?అని వైసీపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అవి ప్రకటించిన పధకాలన్నిటినీ అమలుచేయాలంటే లక్ష కోట్లు కూడా సరిపోవని వాటిన్నిటినీ అమలుచేయడానికి ఎక్కడ నుంచి డబ్బు తెస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే ప్రశ్న రాష్ట్రం సర్వత్రా వినిపిస్తోంది కూడా. కనుక వైసీపి ఈ ప్రశ్న అడిగి టిడిపికి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించి మేలే చేసిందని చెప్పవచ్చు.

టిడిపి, జనసేనలు కూడా సంక్షేమ పధకాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది?అనే ప్రశ్నకు రన్నింగ్ రేసులో ఒకరు దూసుకుపోతుంటే మిగిలినవారు చూస్తూ ఊరుకోరు. ఊరుకుంటే రేసులో ఓడిపోతారు కనుక అందరూ వేగంగా పరిగెత్తి గెలిచేందుకే ప్రయత్నిస్తారు. ఈ విషయంలో టిడిపి, జనసేనలు కూడా అదే చేశాయని చెప్పవచ్చు.

వైసీపి కంటే టిడిపి, జనసేనలు చాలా మెరుగైన ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా ‘రాష్ట్రంలో మళ్ళీ వైసీపి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పధకాలు ఉంటాయి లేకుంటే ఉండవు’ అని వైసీపి దుష్ప్రచారం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అదే… టిడిపి, జనసేనల మ్యానిఫెస్టోలో అసలు సంక్షేమ పధకాలే లేకపోతే?కనుక వైసీపితో పోటీ పడి గెలిచేందుకు అవి కూడా సంక్షేమ పధకాలను ప్రకటించక తప్పలేదని చెప్పవచ్చు.

“వీటన్నిటికి ఎక్కడ నుంచి డబ్బు తెస్తారు?”అనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు వివరంగా జవాబు చెప్పారు. కొన్ని పధకాలను కేంద్ర పధకాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్ధిక భారం తగ్గించుకుంటామని చెప్పారు.

జగన్‌ ప్రభుత్వం ఇంతకాలం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వనరులన్నిటినీ వైసీపి నేతలు దోచుకుతిన్నారని, పైగా పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలను నిర్లక్ష్యం చేయడం వలన ఆదాయం లేకుండా చేసుకొని, సంక్షేమ పధకాలకు అప్పులు చేస్తోందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఈ మూడు రంగాలతో సహా అన్ని రంగాలను అభివృద్ధి చేసి, ఆదాయం సమకూర్చుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ ఎన్నికలలో ఓడిపోతే వైసీపి నేతల అవినీతి, అక్రమాలు, అక్రమార్జన అన్నీ మాఫీ అయిపోయిన్నట్లే అని భావించడం సరికాదని, జగన్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు ఎవరెవరు ఎంతెంత తిన్నారో అంతా కక్కించి ఆ సొమ్ముని సంక్షేమ పధకాలకు వినియోగించుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

రాష్ట్రంలో సహజవనరులు, అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, అనేక పర్యాటక ప్రాంతాలు, అత్యంత సారవంతమైన భూములు, సువిశాలమైన సముద్ర తీరం వంటి అనేకం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరమని వాటన్నిటి నుంచి జగన్‌ ప్రభుత్వం దోచుకోవాలనో లేదా అప్పుల కోసం తాకట్టు పెట్టాలనో అనుకుంది తప్ప వాటి నుంచి ఆదాయం సృష్టించుకోవాలనే ఆలోచన చేయలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వారికి పింఛన్లు అందించడం ప్రభుత్వ బాధ్యత అని దానిని ఎన్నడూ భారంగా అనుకోమని అందుకే వారికి నెలకు రూ.4,000 పింఛన్ ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఆలోచించి, వ్యవసాయ మోటర్లన్నిటినీ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయించడం ద్వారా ఆ విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా తిరిగి మిగులు విద్యు ని గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

మనసుంటే మార్గం ఉంటుందంటారు అది ఇదేనేమో? సంక్షేమ పధకాల కోసం అప్పులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తూ, మరో పక్క అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయేలా చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డిని, రాష్ట్రాభివృద్ధితో సంపద సృష్టించి పేదలకు పంచాలనుకుంటున్న చంద్రబాబు నాయుడుతో పోల్చగలమా?

ADVERTISEMENT
Latest Stories