జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయన నోట ఎక్కువగా ఏ మాటలు వినిపించేవి? ప్రజలు ఆయన నోట ఏమి వినాలనుకునే వారు?అంటే సమాధానం అందరికీ తెలుసు. కనుక అవి అప్రస్తుతం.
ఒక రాజకీయ పార్టీని స్థాపించడం, నిలబెట్టుకోవడం, దాంతో అధికారంలోకి రావడం చాలా చాలా కష్టం. జగన్ ఇవన్నీ సాధించారు. కానీ అధికారం, పదవి, ప్రజాధరణ విలువ తెలుసుకోలేక నష్టపోయారు.
కానీ నేటికీ ఆయన ధోరణి మారలేదు. కనుక ఆయననే నమ్ముకున్న వైసీపీ శ్రేణులు ఎలాగూ నష్టపోతున్నాయి. అలాగే నేటికీ అయన వలన రాష్ట్రానికి నష్టం, సమస్యలు తప్పడం లేదు.
ఓ రాజకీయ పార్టీ అధినేత అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిదంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఏవిదంగా ముందుకు తీసుకుపోవాలో చంద్రబాబు నాయుడు రెండు ఫార్మాట్స్ సృష్టించారు. వాటిని అమలు చేసి విజయం సాధిస్తున్నారు. కనుక వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలతో సహా దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఈ రెండు ఫార్మాట్స్ తప్పక పనికివస్తాయి.
సిఎం చంద్రబాబు నాయుడుకి ఇంత సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ తనలో, పార్టీలో, పాలనలో లోపాలను సరిదిద్దుకోవడానికి ఎన్నడూ వెనకాడలేదు.
పైగా ఈ వయసులో కూడా నిత్య విద్యార్ధిలా కొత్త విషయాలు నేర్చుకుంటూ తనని తాను మెరుగుదిద్దుకుంటున్నారు. ఉదాహరణకు ఇదివరకు తాను అభివృద్ధి, పాలనపై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టడం వలన రాజకీయంగా నష్టపోయానని చెప్పారు. కనుక ఈసారి వాటితో పాటు ‘పొలిటికల్ గవర్నెన్స్’ విధానం అమలుచేస్తున్నారు.
దీనిలో భాగంగా ప్రతిపక్ష వైసీపీని రాజకీయంగా బలంగా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కూటమిలో పార్టీల మద్య ఐక్యత పెరిగేందుకు అవసరమైన చర్యలు, కార్యక్రమాలు చేపడుతున్నారు.
గతంతో పోలిస్తే కేంద్రంతో చంద్రబాబు నాయుడు సంబంధాలు మరింత బలపడటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో చాలా కీలకంగా మారినప్పటికీ విదేయంగానే ఉంటున్నారు.
పెరిగిన ఆ పరపతిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. నెలనెలా సామాన్య ప్రజల మధ్యకు వెళుతూ ప్రజా సంబంధాలు కూడా బలపరుచుకుంటున్నారు.
అలాగే తన వైఖరికి భిన్నంగా ఈసారి అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా ఆయనకు, టీడీపికి, కూటమి ప్రభుత్వానికి ఎంతో మేలు చేసేవే. ఇది రాజకీయ ఫార్మాట్ అంటుకుంటే, రెండో ఫార్మాట్ అభివృద్ధి.
ఈసారి సంక్షేమ పధకాలను భుజానికెత్తుకున్నప్పటికీ ఆయనలో పాత చంద్రబాబు నాయుడు ఇంకా అలాగే ఉన్నారు. అందుకే టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి, విజన్ 2047 వంటివాటికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఇంత పనిచేస్తుండటం, ఇన్ని కొత్త విషయాలు నేర్చుకొని ఆచరణలో పెడుతుండటం, రాజకీయాలు, పాలన, అభివృద్ధిని బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుండటం మామూలు విషయం కానే కాదు.
సిఎం చంద్రబాబు నాయుడు వర్తమాన రాజకీయాలలో ఇంత చక్కటి ఫార్మాట్స్ రూపొందించారు. వీటిని అమలు చేసి విజయాలు కూడా సాధిస్తున్నారు.
కానీ ఆయనని ద్వేషించే రాజకీయ ప్రత్యర్ధులు ఈ రెండు ఫార్మాట్స్ ఒంటబట్టించుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ఒంట బట్టించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం బాగుపడుతున్నారు.




