మొంథా తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ చేస్తే అదో వార్తా? మనం సిఎం కాకపోవచ్చు. కానీ ఆయనకు ఏ విషయంలోనూ తీసిపోము.
మనం బయటకు వస్తే జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ముందో 10… వెనకో 10 వాహనాలు కుయ్ కుయ్ మని సైరన్లు మోగించుకుంటూ దూసుకుపోతుంటే, రోడ్డు కిరువైపులా ఉన్న జనం వాటిలో మనం ఎక్కడున్నామో తెలుసుకునేందుకు ఆరాతపడుతుంటే మాకు అదో ఆనందం!
ఈ వాహనాలు, హడావుడితో మనకీ ముఖ్యమంత్రిననే ఫీలింగ్ కలిగిస్తుంటుంది. కానీ చాలా మంది మాపై పడి ఏడుస్తుంటారు! ఈ అల్ప సంతోషానికి కూడా మేము నోచుకోలేదా?
కర్నూలు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడం కుదరలేదు. కానీ వాళ్ళని వదిలేదే లే! ఏదో రోజు వీలు చూసుకొని వేలాదిమందితో తరలి వచ్చి తప్పక సానుభూతి తెలుపుతాము.
ఈలోగా మొంథా తుఫాను వచ్చి పడింది. కనుక మళ్ళీ మాకు పని పడింది. అందుకే హుటాహుటిన తిరిగి వచ్చేశాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు… మాకూ వీడియో కాన్ఫరెన్సింగ్ వచ్చు!
ఆయన కలెక్టర్లు, అధికారులతో మాట్లాడితే మేము జిల్లాలలో పార్టీ నేతలతో మాట్లాడి పరిస్థితి సమీక్షించాము. అయన ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే మేము మాట్లాడగలం.
ఊళ్ళలో ఇంకా నీళ్ళు, బురద అలాగే ఉన్నాయి.. కాస్త తగ్గితే పరామర్శకు వెళ్దామనుకుంటే ఈలోగానే ఆయన బయలుదేరిపోయారు. నన్ను చూసి భయపడే అలా బురదలో తిరుగుతున్నారు పాపం!
ఆయనని చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పొలోమని జనాల మధ్యకు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ కంటే మనమే ఫస్ట్. మనోళ్ళని ముందుగానే పంపించాము కదా?కావాలంటే సోషల్ మీడియాలో మావాళ్ళ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి చూసుకోండి.
ఆయన అక్కడ బురదలో పడి తిరుగుతుంటే, మనం ప్యాలస్‌లో నుంచి కాలు కడపకుండానే ప్రెస్‌మీట్ పెట్టి “తుఫాను రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకోలేకపోయారని, వస్తే కనీసం పంటలను కాపాడలేకపోయారని…” దంచేస్తున్నాము కదా?
మావాళ్ళు ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. కనుక రేపో ఎల్లుండో తప్పకుండా వాళ్ళు ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్ళి బాధితులను పరామర్శిస్తాము. నో డౌట్! అయినా ఓదార్చడంలో మాకున్న అనుభవం ఈ చంద్రబాబు నాయుడుకి ఉందా?
వీడియో కాన్ఫరెన్స్ మొదలు పరామర్శ వరకు అంతా సేమ్ టూ సేమ్ చంద్రబాబు నాయుడులాగే చేస్తున్నప్పుడు ఇక ఆయనకు మాకు పెద్ద తేడా ఏముంది? మాకు హోదా ఇవ్వకపోయినా మేము సిఎంతో సమానమనే కదా అర్ధం. ఈ మాత్రం తృప్తితో ‘రేపటి కోసం’ ఎదురుచూడగలం! మళ్ళీ మనమే… గుర్తుంది కదా?




