ఎవరి అవసరాలు వారికుంటాయి. ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకుంటారు. ఓ వర్గం లేదా సమాజం లేదా రాష్ట్రాలు, దేశాలు… దేనికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
కానీ భారత్ అవసరాలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ట్రంప్‌కి కోపం వస్తుంది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి భారత్‌కు అవసరమైన ఆయుధాలు, యుద్ధ విమానాలు వగైరా కొనుగోలు చేస్తే ట్రంప్‌కి రోషం పొడుచుకు వస్తుంది.
కనుక సుంకాలు, హెచ్-1బీ వీసాల పేరుతో భారత్ చెయ్యి మెలిపెట్టి రూ.800 కోట్ల ఆయుధ ఒప్పందంపై సంతకం పెట్టుకొని శాంతించారు. కానీ ఇప్పుడు కధ మళ్ళీ మొదటికొస్తోంది.
అమెరికాలో వ్యవసాయ రంగంలో ఉన్న కంపెనీలతో ట్రంప్ మొన్న సమావేశమయ్యారు. భారత్, చైనా, పాకిస్తాన్, తైవాన్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున బియ్యం, గోధుమలు, ఇతర ఆహార ఉత్పత్తులు అమెరికాకు దిగుమతి అవుతున్నాయి. వాటి వలన తమకు, అమెరికన్ రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వారు ట్రంప్‌కి పిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన ట్రంప్, భారత్‌తో సహా ఆయా దేశాల ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే అమెరికన్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు భారీ ఆర్ధిక ప్యాకేజ్ కూడా ప్రకటించారు. కనుక భారత్ ఎగుమతులకు మళ్ళీ ట్రంప్ దెబ్బలు తప్పవన్న మాట!
ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన తన దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలని అనుకుంటున్నారు కనుక!
కానీ దశాబ్దాలుగా భారత్ మార్కెట్‌ని కబళించి భారతీయ పరిశ్రమలను చావు దెబ్బ తీస్తున్న ‘చైనా మాల్’ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది?
అంటే చాలా చేసిందని చెప్పుకుంటుంది. కానీ ఇప్పుడు 150 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో చైనా వస్తువులు లేని ఇల్లు ఒకటైనా ఉందా?
దేశంలో నేటికీ విద్యుత్, రోడ్లు వంటి ప్రాధమిక సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలలో కూడా చైనా వస్తువులే కనిపిస్తున్న మాట వాస్తవమే కదా?
అంటే దేశంలో మారుమూల గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరుకోలేకపోయాయి కానీ చైనా చేరుకోగలిగిందనే కదా అర్ధం!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశం కోసం ఇంత ఖరాఖండిగా వ్యవహరిస్తుంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ‘ఇగో’ కోసం ఉక్రెయిన్ మీద ఏళ్ళ తరబడి యుద్ధం చేస్తారు.
కానీ భారత్‌లో కోట్లమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న చిన్న, మద్య, పెద్ద పరిశ్రమలను చైనా తన ఉత్పత్తులతో దెబ్బ తీస్తుంటే, కేంద్ర ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి చైనాపై దిగుమతులపై ఆంక్షలు విధించడానికి సాహసించదు!
భారత్ మార్కెట్‌ని కబళిస్తున్న ‘చైనా మాల్’ వలన దేశీయ పరిశ్రమలు నష్టపోయి, మూతపడుతుంటే వాటిలో పనిచేస్తున్న కోట్లాదిమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు చైనా కారణంగా నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోతుంది.
నిరుద్యోగం, ఆర్ధిక సమస్యలు పెరిగితే కడుపు నింపుకోవడానికి నేరాలకు పాల్పడటం సహజం. సమాజంలో నేరాలు పెరిగితే అది ఎవరికీ మంచిది కాదు. చాప కింద నీరులా చైనా దిగుమతులతో దేశానికి ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ, చైనాకి ‘నో’ చెప్పలేని నిసహయత! ఏమనుకోవాలి?




