పొలిటికల్ పరంగా మాజీ కేంద్రమంత్రి, సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవి శ్రీకాకుళంలో సందడి చేశారు. శ్రీకాకుళం సమీపంలోని కోర్మయ్యపేటలో గల దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరీ అమ్మ వారిని చిరంజీవి మరియు కుటుంబ సభ్యులు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఆశ్రమం వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.
ఓ పక్కన మెగాస్టార్ ఇలా బిజీగా ఉంటే, చిరు కోడలు, రామ్ చరణ్ భార్య ఏపీకి మరో వైపున గల పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయాన్ని ఉపాసన దర్శించుకున్నారు. రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో, ఉపాసన ఒక్కరే రాఘవేంద్రస్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసారు. కాగా, దైవదర్శనానికి విచ్చేసిన ఉపాసనకు పీఆర్వో ఐపీ నర్సింహమూర్తి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంధ్రస్వామి బృందావనం దర్శనానంతరం ఉపాసన పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. రామ్ చరణ్ కు లేటెస్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల కాగా, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరో నాలుగు రోజుల్లో ప్రత్యక్షం కానున్న నేపధ్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.



