రాజకీయ పార్టీలు ఆడుకునే రాజకీయ చదరంగంలో వేలు పెడితే ఏకంగా చెయ్యే తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈవిదంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలైపోవడం అందరికీ తెలుసు. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే లీగల్ నోటీసులు పంపించి కర్నూల్ సీఐ శంకరయ్య కూడా ఇలాంటి తప్పే చేశారని చెప్పక తప్పదు.
ఇదివరకు కదిరి సీఐగా చేసిన గోరంట్ల మాధవ్‌కు వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆయన హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు. రాజకీయాలలో సెటిల్ అయ్యారు.
కనుక సీఐ శంకరయ్య కూడా అటువంటి ప్రలోభంతోనే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపించి ఉండవచ్చని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌కు ఆశపడి జగన్ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో శంకరయ్య పావుగా మారి చివరికి అతనే నష్టపోతాడన్నారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగానే పరిగణిస్తోందని, దీనిపై దర్యాప్తు చేయించి శంకరయ్య వెనుక ఎవరున్నారో బయటపెడతామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు.
సీఐ శంకరయ్య వెనుక వైసీపీ ఉన్నట్లయితే దీంతో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లగలదు తప్ప మరేమీ సాధించలేదు. పైగా గతంలో మాదిరిగానే శంకరయ్య యూటర్న్ తీసుకొని కేసు వాపసు తీసుకొని, తనను ఇందుకు ప్రోత్సహించిన వైసీపీ నేతల పేర్లు బయటపెడితే వారి పరువే పోతుంది కదా?
శంకరయ్య వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లయితే, అటకెక్కిపోయిన వివేకా హత్య కేసుని వారే ఈవిదంగా కిందకు దింపి విచారణ వేగవంతం చేయించుకున్నట్లే అవుతుంది కూడా.
ఇటువంటి చిల్లర కేసుతో వైసీపీ అప్రదిష్టే తప్ప ఎటువంటి రాజకీయ ప్రయోజనం కలగదని తెలిసి ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నం చేయడం అవివేకమే కదా?




