టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులు, విచారణ, వాయిదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పర్యవేక్షిస్తుండగా, వాటిపై ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులలో వాదిస్తున్నారు. ఇది వారి ఉద్యోగధర్మం గాబట్టి వారిని తప్పు పట్టలేము. అయితే ప్రభుత్వం ఒత్తిళ్ళ వల్ల కావచ్చు లేదా అత్యుత్సాహం వలన కావచ్చు వారిద్దరూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి ఈ కేసుల గురించి మీడియాకు వివరించారు.
ఈ కేసులలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితరులు అందరూ అవినీతికి పాల్పడ్డారని తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయని వారు మీడియాకు తెలియజేశారు. తాము చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని, కనుక ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపుగా చూడరాదని చెప్పారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి జగన్ ప్రభుత్వం ఈ అక్రమకేసులు బనాయించి తమపై ఏవిదంగా రాజకీయ కక్షలకు పాల్పడుతోందో వివరించడంతో, జగన్ ప్రభుత్వం కూడా సజయ్, పొన్నవోలుని ఢిల్లీకి పంపించింది లేదా తామే స్వయంగా వచ్చామని వారు చెప్పుకొని ఉండవచ్చు.
ఈ వ్యవహారంలో నారా లోకేష్ బాధితుడు కనుక జాతీయ మీడియాకు తన గోడు మొర పెట్టుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఇంచుమించు ఒకేసమయంలో మూడు కోర్టులలో ఈ కేసుల విచారణ కొనసాగుతున్నప్పుడు, వాటిని పర్యవేక్షిస్తున్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, వాదిస్తున్న పొన్నవోలు పనిగట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడవలసిన అవసరమే లేదు. కోర్టులు కేసులను విచారిస్తునప్పుడు వాటిని ప్రభావితం చేసేవిదంగా వాటి గురించి ప్రభుత్వాన్ని సమర్ధించుకొంటూ బయట మీడియాకు చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది.
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఇదేవిషయమై పిర్యాదులు అందాయి. ఏపీ యునైటడ్ ఫోరం ఫర్ కాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో, వారిద్దరి ప్రెస్‌మీట్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోమ్ కార్యదర్శికి గవర్నర్ తరపున ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ లేఖ వ్రాశారు.
ఇదివరకు తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా అత్యుత్సాహంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు బీజేపీ ప్రతినిధులను ఏవిదంగా వలపన్ని పట్టుకొన్నామో ప్రెస్‌మీట్ తెలియజేశారు. ఆ ఫోటోలు, వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు.
సరిగ్గా ఇదే కారణంగా తెలంగాణ హైకోర్టు ఆ కేసును విచారిస్తున్న సిట్ బృందానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత కోర్టులకు మాత్రమే తెలియజేయవలసిన రహస్య వివరాలను మీడియాకు బహిర్గతం చేసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ, ఆ కేసునే రద్దు చేసింది. బీజేపీ ప్రతినిధులకు విముక్తి కల్పించింది.
ఇప్పుడు ఏపీ సీఐడీ చీఫ్, అడ్వకేట్ జనరల్ కూడా అదే పొరపాటు చేశారని స్పష్టమవుతోంది. అందుకే గవర్నర్ వారిరువురిపై విచారణ జరిపి చర్యలు తీసుకోమని ఆదేశించిన్నట్లు అర్దమవుతోంది.




