
టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టిడిపి నేతలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో మళ్ళీ టిడిపిని బలోపేతం చేసుకునేందుకు వారికి దిశా నిర్దేశం చేస్తారు. ముందుగా తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదివరకు కూడా కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్టీకి అధ్యక్షుడుగా నియమిస్తే ఆయన పార్టీని బలోపేతం చేసి ఎన్నికలలో టిడిపి పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు వద్దనుకున్నారు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ఆంధ్ర టిడిపిపై తప్ప తెలంగాణ టిడిపిపై ఆసక్తి లేదని కాసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేయకపోతే అటువంటి అనుమానాలు, ఆరోపణలు తప్పవు.
అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు వద్దన్నారో బహుశః ఈపాటికి కాసాని జ్ఞానేశ్వర్‌కి కూడా అర్దమయ్యే ఉంటుంది.
ఈ ఆరోపణలు, ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుందా లేదా?అసలు తెలంగాణ టిడిపిని ఎందుకు బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు?దీని వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం?అనే సందేహాలు కలుగుతాయి.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూతురు కవిత కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలలో, మళ్ళీ ఇప్పుడు ఆమెని విడిపించుకోవడం కోసం పార్టీని బలిపెట్టేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు వారి ఆందోళనని మరింత పెంచుతున్నాయి.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
కనుక ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇది సహజం. అయితే కాంగ్రెస్‌లోకి వెళ్ళలేనివారికి వేరే ప్రత్యామ్నాయం లేదు కనుక మిగిలినవారు బీజేపీవైపు చూస్తారు. కనుక వారికి ఆ ప్రత్యామ్నాయంగా టిడిపిని చూపాలని బహుశః చంద్రబాబు నాయుడు భావిస్తున్నారేమో?
బిఆర్ఎస్ పార్టీలో చాలామంది టిడిపి నుంచి వెళ్ళినవారే ఉన్నారు. కనుక ఒకవేళ తెలంగాణలో టిడిపిని బలపడితే మళ్ళీ వారు వెనక్కు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదీగాక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. కనుక తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసుకోవడానికి ఇదే తగిన సమయమని చంద్రబాబు నాయుడు భావిస్తుండవచ్చు.
మరో విషయం ఏమిటంటే, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను టిడిపిలోకి ఆకర్షించగలిగితే వారు రేవంత్ రెడ్డిపై అస్త్రాలు సందించకుండా చంద్రబాబు నాయుడు నియంత్రించగలరు. అదే… వారు బీజేపీలో చేరితే మరింత ఉదృతంగా విరుచుకుపడతారు. కనుక వారిని టిడిపిలోకి ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.
కానీ తెలంగాణ టిడిపి కేవలం ‘రాజకీయ నీడ’ కల్పిస్తూ కాలక్షేపం చేసేందుకు మాత్రమే అని అనుమానాలు, అపోహలను చంద్రబాబు నాయుడు తొలగించాల్సి ఉంటుంది. అందుకోసం త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపిని బరిలో దించాల్సి ఉంటుంది. బహుశః ఆ ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారేమో?