తూచ్! రెండు కాదు.. 13 లక్షల కోట్లట!

cm ys Jagan Speech at Global Summitవిశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, “ఏపీకి 13 లక్షల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెపుతున్నాను. తొలిరోజే 90 కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి. రెండు రోజుల సదస్సులో 20 రంగాలలో మొత్తం 340 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో 340 ఎంవోయూలు చేసుకోబోతున్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దేశాభివృద్ధిలో ఏపీ కీలకంగా నిలుస్తోంది. ఏపీలో మా ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు అమలుచేస్తోంది. తత్ఫలితంగా ఏపీ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే వాటిలో మూడు ఏపీలోనే ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ళుగా ఏపీ అగ్రస్థానంలో ఉంది. త్వరలోనే ఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించబోతున్నాము,” అని అన్నారు.

నిన్నటివరకు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈ సదస్సు ద్వారా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని పదేపదే చెప్పారు. ఇదే మాట తాను చెపితే ప్రజలు నమ్మరనుకొన్నారో లేదా బహుశః మొహమాటపడ్డారో కానీ మంత్రి గుడివాడ రెండు లక్షల కోట్లతోనే సరిపెట్టేశారు. కానీ రెండూ మూడూ కాదు ఏకంగా 13 లక్షల కోట్లొస్తున్నాయి! దీంతో ఏపీ దరిద్రం ఇక తీరిపోయిన్నట్లే. వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి కనుక నిరుద్యోగులు ఇక హైదరాబాద్‌, బెంగళూరు అంటూ ఊళ్ళు పట్టుకొని తిరగక్కరలేదు. హాయిగా ఏపీలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు.

ADVERTISEMENT

త్వరలో ఎలాగూ విశాఖ రాజధాని అయిపోతోందని సిఎం జగన్‌ తేల్చి చెప్పేశారు కనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ వయసులో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు, మంత్రి పదవి త్యాగాలు చేయనక్కరలేదు. అలాగే విశాఖ రాజధాని కాగానే శ్రీకాకుళం జిల్లా దానంతట అదే ఎలాగూ అభివృద్ధి చెందిపోతుంటుంది కనుక ఆయనకీ శ్రమ తగ్గుతుంది.

రూ.13 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 340 పరిశ్రమలు వచ్చేస్తున్నాయి కనుక పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డికి ఇక టిడిపి, జనసేనలని వాటి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శించేందుకు తీరిక ఉండకపోవచ్చు. కనుక ఆ బాధ్యతని మంత్రులు రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొడాలి నానే చూసుకోవలసి ఉంటుంది.

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కి పెట్టుబడులు, పరిశ్రమలు ఏవిదంగా సాధించాలో ఎలాగో తెలియక పాపం గత 8 ఏళ్లుగా దావోస్, అమెరికా, బ్రిటన్ అంటూ దేశాలు పట్టి తిరుగుతూ, పారిశ్రామికవేత్తల కాళ్ళావేళ్ళాపడి అతి కష్టం మీద ఏడాదికి ఓ లక్షన్నర కోట్లవరకు మాత్రమే పెట్టుబడులు తెచ్చుకోగలుగుతున్నారు. వాటి ద్వారా ఓ 20-30 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించగలుగుతున్నారు.

కానీ మన ఏపీ మంత్రులు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే ఒక్కరోజులోనే ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 340 కంపెనీలు, 6 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చి పడేశారు. కనుక ఏపీకి ‘గుడ్ లక్’ అని ఏ ఉద్దేశ్యంతో చెప్పినా ఇప్పుడు ఆయన కూడా ఏపీ మంత్రుల వద్ద ‘కోడి-గుడ్డు పాఠాలు’ నేర్చుకొంటే మంచిదేమో? లేకుంటే ఏపీతో పోటీ పడలేక తెలంగాణ వెనకబడిపోవచ్చు. అప్పుడు తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రాన్ని మళ్ళీ ఏపీలో కలిపేయాలని ఉద్యమాలు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 340 కంపెనీలు, 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నందున ఇలా ఎంత చెప్పుకొన్నా తనివి తీరడం లేదు.

ADVERTISEMENT
Latest Stories