ఇటీవల హైదరాబాద్‌లో స్పేస్ రూట్ అనే ప్రైవేట్ సంస్థ తయారుచేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడం వల్లనే ఇది సాధ్యమైంది. దానిలో యువ శాస్త్రవేత్తలు ఏవిధంగా ఈ కొత్త ఆవిష్కరణ చేశారో, అదే విధంగా యువత కూడా రాజకీయాలలోకి ప్రవేశించి సరికొత్త ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించడం చాలా అవసరమే.
నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్ధులను ఉద్దేశ్యించి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, ‘ప్రజాస్వామ్యామానికి తెల్లారింది. మనం విజయం సాధించాం. మొదటి వికెట్ పడింది. అంతం కాదిది ఆరంభం!” అని అన్నారు.
అంటే సీజేపీ ఇకపై పూర్తి స్థాయి రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటోందా లేక కేవలం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకుంటున్న పార్టీల తరపున పోరాటాలు చేయబోతోందా? అనే సందేహం కలుగుతోంది. రాబోయే రోజుల్లో క్రమంగా సీజేపీ ఆలోచనలు, లక్ష్యాలు ఎలాగూ తెలుస్తాయి.
దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే మంచి ఆలోచనతో రాజకీయాలలోకి వస్తే, ఆ నిజాయితీ ఉందని నిరూపించుకోగలిగితే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. కనుక యువతకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీజేపీ తన సొంత మార్గంలో సొంత లక్ష్యాలతో ముందుకు సాగితే మంచిదే.
కానీ ఒక పార్టీ, ప్రభుత్వం, పాలకులపై ద్వేషంతో లేదా అలాంటి వారితో చేతులు కలిపి రాజకీయాలలో రాణించాలనుకుంటే సాధ్యం కాదు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఒక కులం లేదా మతం లేదా మరో బలం ఉన్నవారిని వాడుకొని అవసరం తీరాక ఏవిధంగా పక్కన పడేస్తాయో అందరికీ తెలుసు.
మళ్ళీ బిజేపి వస్తే మోడీయే ప్రధానిగా ఉంటారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి వంటివారు బహిరంగంగానే చెపుతున్నారు.
కనుక దేశంలో ఈ రెండు జాతీయ పార్టీలకు సీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలనుకుంటోందా లేక కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలనుకుంటోందా? లేక రాజకీయాలకు దూరంగా ఇటువంటి ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితం కావాలనుకుంటోందా? ముందు తేల్చుకోవడం చాలా మంచిది.
నిర్దిష్టమైన ఆలోచన లేకుండా రాజకీయాలలోకి వస్తే అధికార, ప్రతిపక్షాల రాజకీయ చదరంగంలో సీజేపీ కూడా పావుగా మిగిలిపోవచ్చు.






