జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న “బిగ్ బాస్” కోసం సెలబ్రిటీల ఎంపిక జోరుగా సాగుతోంది. ఓ పక్కన తారక్ తో ప్రమోషన్ వీడియోలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో క్రేజ్ లో అలాగే ఉంచేలా ప్రయత్నం చేస్తూ… మరో పక్కన సెలబ్రిటీల ఎంపిక చూస్తున్నారు. ప్రస్తుతం టాప్ స్థాయిలో ఉన్న యాంకర్లందరినీ సంప్రదించగా, అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక మిగతా వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే ఇప్పటికే ఓ పేరుగా పోసాని కృష్ణమురళీ పేరు ఖరారు కాగా, తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.
బుల్లితెరపై ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ధనాధన్ ధన్ రాజ్ ను ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు సంప్రదించగా, దానికి ధన్ రాజ్ ఓకే చెప్పారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ధన్ రాజ్ ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. తాను 71 రోజుల పాటు ఓ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్తున్నానని, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ‘బిగ్ బాస్’ అన్న కార్యక్రమం పేరు వెల్లడించలేదు గానీ, అది వాళ్ళే ప్రకటిస్తే బాగుంటుందని వదిలేసారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే ధన్ రాజ్ ఎంపిక పూర్తయ్యిందని, మేల్ విభాగంలో పోసానితో పాటు ధన్ రాజ్ కూడా సెలక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఫీమేల్ సెలబ్రిటీల దగ్గరికి వస్తే… ‘ఐస్ క్రీం’ పాప తేజస్విని ఓకే చెప్పినట్లుగా టాక్. మొత్తం 12 మంది సెలబ్రిటీలు భాగస్వామ్యం కాబోతున్న ఈ షో తెలుగునాట ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా తమిళంలో కమల్ హాసన్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ షో తొలి భాగాలు ఆశించిన స్పందనను తెచ్చుకోలేదని తెలుస్తోంది.


