
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రేవంత్, కేటీఆర్ ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకుంటూ ఒకరి పై మరొకరు విమర్శల బాణాలను ఎక్కుపెడుతూ ముందుకెళుతుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మాత్రం తమ పార్టీకి తమ మాటలతోనే గుయ్యి తొవ్వి తమ చేతులతోనే హస్తం పార్టీని బొంద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలిసి చేస్తున్నారో, తెలియాక చేస్తున్నారో, లేక రాష్ట్ర నాయకత్వంతో కలవలేక కావాలనే చేస్తున్నారో కానీ కొందరు కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న వ్యాక్యలతో కాంగ్రెస్ పార్టీకి డామేజ్ జరిగే అవకాశం లేకపోలేదు. ఓ మీడియా ఛానెల్ ఏర్పాటు చేసిన రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తన హీరోయిజం చూపించు కోవాలనుకున్నారో ఏమో కానీ గతంలో తానూ చేసిన గుద్దుడ్ల గురించి రెచ్చిపోతూ చెప్పుకుంటున్నారు.
ఈ అరెస్టులు నన్నేం చేస్తాయి చారి గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎస్పీ కారునే గుద్దేసినా,రోశయ్య కలెక్టర్ గా ఉన్నప్పుడు మూడు నాలుగు గంటలు బూతులల్లో దూరండి మొత్తం గుద్దిపడేయండి అని చెప్పినా! అంటూ సినిమాలో హీరో మాదిరి ఎలివేషన్ ఇచ్చుకున్నారు జగ్గారెడ్డి. సినిమాలలో అయితే గట్ల చేస్తే చెల్లుతాయి గాని నిజజీవితంలో అట్లా చేస్తే రౌడీయిజం అవుతాది బిడ్డా అంటూ జగ్గారెడ్డి పై విమర్శలు మొదలయ్యాయి.
మొదటి నుంచి రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్స్ సీనియర్లు రోజుకొకరు పూటకో మాట మాట్లాడి కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను చేచేతులా కాలరాసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తమవంతు పాత్ర పోషిస్తుంటారు. అటువంటి వారి వ్యాఖ్యలే ప్రత్యర్థి పార్టీలకు బలం చేకూర్చి పెడతాయి అనే కనీస అవగాహన్ కూడా ఈ నేతలకు కరువయ్యింది.
ఎస్పీని గుద్దా, బూతులతో రిగ్గింగ్ చేయించా అంటూ గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులను చూస్తున్న ప్రజలు “ఏందీ సామి… ఈ గుద్దుడేంది? ఈ చెప్పుడేంది?” అంటున్నారు.ఇలాంటి వారిని సమర్థిస్తున్న పార్టీలు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఎన్నికలకు టైం దగ్గరపడే ఇటువంటి కీలక సమయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలను ఒకగాడికి కట్టలేకపోతే తెలంగాణలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండదు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎంతమంది బాహుబలులు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కాదు అనేక మంది కట్టప్పలు సిద్ధంగా ఉంటారు అదునుచూసి అంత మొందించడానికి అనేది వాస్తవం.