సిఎం రేవంత్ రెడ్డితో నిన్న సినీ ప్రముఖుల సమావేశం తర్వాత సంక్రాంతికి ఎవరు వచ్చినా తెలంగాణలో గేమ్ చేంజ్ కాదని స్పష్టమైపోయింది. కనీసం ఏపీలో అయినా గేమ్ చేంజ్ అవుతుందా.. లేదా?అంటే అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
డాకూ మహరాజ్ హీరో బాలకృష్ణ స్వయాన్న సిఎం చంద్రబాబు నాయుడుకి బావమరిది. వియ్యంకుడు కూడా. ఇక గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ స్వయాన్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కుమారుడు. పైగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కూడా. ఇక విక్టరీ వెంకటేష్కి బలమైన దగ్గుబాటి కనెక్షన్ ఉండనే ఉంది.
కనుక మూడు సినిమాలకు సంక్రాంతి పండుగకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమే. అయితే హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాలను, ఇతర అంశాలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రివిలేజ్ షోలను అనుమతించకపోవచ్చునేమో కానీ అదనపు షోలకు, టికెట్ చార్జీలు పెంచుకునేందుకు అనుమతించడం ఖాయమనే భావించవచ్చు.
వైసీపీ అభ్యర్ధి కోసం ప్రచారం చేసి, వైసీపీ నీడలో ఉన్న అల్లు అర్జున్ సినిమా పుష్ప-2కే టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించినప్పుడు, అబ్బాయ్ సినిమాని, బావమరిది సినిమాలని ఏపీ ప్రభుత్వం అనుమతించకుండా ఉంటుందా?అంటే ఉండదు.
ఆ రెంటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలకు కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా? కనుక ఏపీలో సినీ పరిశ్రమకి ‘రన్ వే’ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కనుక నిర్భయంగా ల్యాండ్ అయిపోవచ్చు.
లైన్ క్లియర్ చేసిన్నట్లే.. అభిమానులు సంక్రాంతి పండుగకి సిద్దమైపోవచ్చు.
కొస మెరుపు: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే పెద్ద టాస్క్ మాకు ఇచ్చారని నిన్ననే చెప్పిన టిఎఫ్‌డిసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఆ ప్రయత్నంలో భాగంగా ఈ నెల 29న విజయవాడలో వజ్రా గ్రౌండ్స్, బృందావన్ కాలనీలో గేమ్ చేంజర్‌లోని రామ్ చరణ్ అతిపెద్ద కటవుట్ ఆవిష్కరించబోతున్నారు.




