పాపం పురందేశ్వరి… ఇటు వైసీపి, అటు అధిష్టానం!

Daggubati Purandeswariఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టడంతో ఇక రాష్ట్రంలో బీజేపీని లేడిలా పరుగులు పెట్టిస్తారని అందరూ అనుకొన్నారు. ముఖ్యంగా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలుపెడతారని అందరూ అనుకొన్నారు. ఆమె కూడా ఆ అంచనాలకు తగ్గట్లుగానే వస్తూనే జగన్‌ ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు, ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT

అటు నందమూరి కుటుంబ నేపధ్యం, ఇటు అత్యంత శక్తివంతమైన కేంద్రం ఆమె వెనుక ఉండటంతో ఆమెను ముందే కట్టడి చేయకపోతే తట్టుకోవడం కష్టమని గ్రహించిన వైసీపి నేతలు ఆమె చంద్రబాబు నాయుడు తరపునే టిడిపి కోసమే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసి ఆమె కాళ్ళు, చేతులు, నోరు కట్టేశారు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆమె చాలా క్లుప్తంగా స్పందించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె గట్టిగా ఖండించలేకపోతున్నారు. ముందర కాళ్ళ బందం వేయదమంటే ఇదేనేమో?

వైసీపీ నేతలు ఆమెను చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మాట్లాడనీయకుండా చేస్తే, చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించకుండా మౌనం వహిస్తూ వారు కూడా ఆమెను మాట్లాడనీయకుండా చేశారు. చివరికి జనసేన-బీజేపీ పొత్తుల గురించి కూడా ఆమెను మాట్లాడలేని పరిస్థితి కల్పించారు.

దీంతో ఏపీ రాజకీయాలలో సునామీ సృష్టించాలని ఉత్సాహంగా వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి, ఉపరితల ఆవర్తనంలా చల్లబడిపోక తప్పలేదు. ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాలలో దేని గురించి కూడా మాట్లాడలేని దయనీయస్థితి.

ఒకవేళ మాట్లాడినా ఆమె మాటలకు విశ్వసనీయత లేకుండా చేశారు మోడీ, అమిత్ షాలు. కనుక ఏపీ బీజేపీలో ఆమెతో సహా అందరూ సైలంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మోడీ, అమిత్ షాలు ఢిల్లీలో స్విచ్ ఆన్‌ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఏపీ బీజేపీ అడుగు ముందుకు వేయలేదు. నోరుమెదపలేదు. పాపం పురందేశ్వరి!

ADVERTISEMENT
Latest Stories