కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పూర్తి మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకున్నారని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కిమ్స్ లో దాసరిని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ… ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ధ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాము… మీ ఆశీస్సులు కావాలని కోరగానే… ఆయన సంతోషం వ్యక్తం చేశారని, అంతే కాకుండా తనకు అభినందనలు చెప్పారని అన్నారు.
వాస్తవానికి దాసరి మాట్లాడే పరిస్థితిలో లేనప్పటికీ, అన్ని విషయాలను పేపరుపై రాసి వివరాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కలెక్షన్ల గురించి అడిగారని, 150వ సినిమా 150 కోట్ల వసూళ్లను దాటిందని తాను చెప్పగా… 250 కోట్లు దాటాలంటూ దాసరి ఆకాంక్షించారని చిరు తెలిపారు. ‘ఖైదీ నంబర్ 150’ ఫంక్షన్ కు వచ్చి మాట్లాడుతానని చెప్పడంతో తనకు మిక్కిలి సంతోషం వేసిందని, దాసరి ఆత్మస్థైర్యమే ఆయనను కోలుకునేలా చేసిందని అన్నారు.
దాసరి ఇలా ఆరోగ్యంతో మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరగా కోలుకుని మరో నాలుగు రోజుల్లో ఆయన పూర్తి శారీరక ఆరోగ్యం సంతరించుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నానని మెగాస్టార్ తెలిపారు. బావమరిది అల్లు అరవింద్ తో పాటు కిమ్స్ కు విచ్చేసారు చిరు. నేడు దాసరిని సందర్శించిన వారిలో ప్రముఖ నటి జయప్రద, దర్శకుడు వీవీ వినాయక్, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నిర్మాత సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు.



