దేశరాజధాని ఢిల్లీ రేపిస్టు సిటీగా అప్రదిష్ఠమూటగట్టుకుంది. నిర్భయ ఘటన జరిగిన అనంతరం రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అపవాదు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గుర్గావ్ పారిశ్రామిక ప్రాంతంలో ఎప్పటికప్పుడు రేప్ ఘటనలు ఆందోళన పరుస్తున్న తరుణంలో… మహిళలపై లైంగిక దాడులు జరిగే అవకాశమున్న ప్రమాదకర నగరాలతో పాటు అత్యంత సురక్షిత నగరాలపై లండన్ కు చెందిన థామ్సన్ రాయిటర్స్ సంస్థ…ప్రపంచంలోని 19 మహానగరాల్లో సర్వే నిర్వహించింది.
గత జూన్-జులై నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో నగరం నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 380 మంది నిపుణులు పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్న నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ, “రేప్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్”గా రికార్డులకెక్కింది. దీంతో దేశరాజధాని పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిసింది.
ఢిల్లీలోని మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అంటే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్న సమాధానమే వస్తుంది తప్ప, ఈ మానభంగాల సీక్వెల్స్ కు అడ్డుపడేలా కనపడడం లేదు.


