KCR YS Jagan

అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి దానికి కట్టుబడి పాలన సాగిస్తే, ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నట్లు ఆ ప్రజాస్వామ్యమే పాలకులను కాపాడుతుంది.

ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్‌ని ఉపేక్షించినందువల్ల 2019లో ఓడిపోయినప్పటికీ, మళ్ళీ అదే ప్రజాస్వామ్య వ్యవస్థ 2024 ఎన్నికలలో ఆయనను గెలిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇది పదేపదే నిరూపించబడుతూనే ఉంది.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను, ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు 5 ఏళ్ళు నిరంకుశ, అరాచక పాలన చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఉంటే ప్రతిపక్షాలను ఇంత కర్కశంగా అణచివేయాలని ప్రయత్నించేవారు కారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని కోరుకునేవారే కారు.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నించి భంగపడటం కళ్ళారా చూస్తున్నప్పుడైనా జగన్‌ అటువంటి ఆలోచనలు మానుకొని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించి ఉంటే నేడు ఈ ఓటమి నుంచి తప్పించుకోగలిగేవారు.

Also Read – వైఎస్ ఎవరివాడో… ఎవరికి దక్కుతాడో?

కానీ ప్రజాస్వామ్యమనే మహా శక్తి చేతిలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తనను తాను, తన పార్టీని కాపాడుకోవడానికి ఇక్కడ జగన్‌, అక్కడ కేసీఆర్‌ అదే ప్రజాస్వామ్యాన్ని ఆశ్రయిస్తుండటం చాలా విడ్డూరమే కదా? .

కేసీఆర్‌, జగన్‌ తాము అధికారంలో ఉన్నప్పుడు కాలరాసిన ప్రజాస్వామ్యమే, ఓడిపోయిన తర్వాత తమని కాపాడుతుందని గట్టిగా నమ్ముతుండటం చూస్తే ప్రజాస్వామ్యం శక్తి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

Also Read – జగన్‌ ధోరణి… వైసీపి దౌర్భాగ్యం

ఇంతకీ ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే, జగన్‌ ప్రజాస్వామ్యం, ఈవీఎంల గురించి చేసిన ట్వీటే.

“న్యాయం అందుతుందని అనుకోవడం కాదు… అది అందిన్నట్లు కనిపడాలి కూడా. ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడమే కాదు… అది ప్రత్యక్షంగా కనిపించాలి కూడా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎన్నికల ప్రక్రియకు పేపర్ బ్యాలట్స్ మాత్రమే వాడుతున్నాయి. ఈవీఎంలు కాదు. కనుక మనం కూడా ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడుకునేందుకు మళ్ళీ పేపర్ బ్యాలట్స్ ప్రక్రియకు మారడం చాలా మంచిది,” అని జగన్మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

అంటే టిడిపి, జనసేన, బీజేపీలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వలననే అవి గెలిచి, తాము ఓడిపోయామని జగన్‌ చెపుతున్నట్లు స్పష్టమవుతోంది. అంటే తమ ఓటమికి తన అసమర్దత, అవినీతి, అరాచకాలు, అనాలోచిత నిర్ణయాలు కారణాలు కావని జగన్‌ గట్టిగా నమ్ముతున్నట్లు అర్దమవుతోంది. ఈసారి ఎన్నికలలో తమకు 175కి 175 సీట్లు వస్తాయని జగన్‌ చెప్పుకున్నారు. ఒకవేళ అన్ని రాకపోయినా ఈ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు జగన్‌ ఈవీఎంలను తప్పు పట్టేవారా?అంటే కాదని తెలుసు.

అంటే తాము గెలిస్తే ఈవీఎంలు మంచివి లేకుంటే ప్రజాస్వామ్యానికి హానికరం అని జగన్‌ భావిస్తున్నట్లు అర్దమవుతోంది. కానీ రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, తమకు కూడా జగన్మోహన్‌ రెడ్డే హానికరమని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావించబట్టే జగన్‌ లక్షల కోట్లు పంచిపెట్టినా తిరస్కరించారని వైసీపి నేతలకు కూడా తెలుసు.

ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, లోపాలు సరిదిద్దుకొన్నవారిని ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ నిరూపించి చూపారు. కానీ అహంకారంతో విర్రవీగితే ప్రజలు క్షమించరని గ్రహించడానికి కేసీఆర్‌, జగనే ప్రత్యక్ష సాక్షులు.

లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ (బిఆర్ఎస్ పార్టీ) మళ్ళీ ఓడిపోవడం గమనిస్తే, ఓడినా ఇంకా అహంభావంతో విర్రవీగితే ప్రజలు అసలే క్షమించరని స్పష్టమవుతోంది.

అంటే ప్రజాస్వామ్యం కళ్ళకు కనిపిస్తూనే ఉందిగా? కానీ కేసీఆర్‌, జగన్‌ దానిని చూడలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?