
ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే కనపడేవి. ఎందువల్ల అంటే, ప్రభుత్వ ఆదాయం, అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్లు అన్నీ సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచడానికే ఉపయోగించేవారు కనుక. ఈ కారణంగానే జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలం జీతాలు కూడా చెల్లించలేకపోయేది. మరి అటువంటప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా చేయగలదు?
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు, పరిశ్రమలు పెట్టుబడులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక కేవలం ఈ 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.
Also Read – ఫీజుల పెంపు పై చట్టం…హర్షిది’రేఖా’లు.!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రాజధాని పేరుతో కాలక్షేపం చేసిన రుషికొండపై రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టుకున్నారు. నగరంలో బస్టాపులపై తన బొమ్మలతో బోర్డులు పెట్టించుకున్నారు తప్ప నగరంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదు. మరి అటువంటప్పుడు కొత్తగా రోడ్లు వేస్తారని, ఫ్లై ఓవర్లు నిర్మిస్తారని ఆశించడం తెలివితక్కువ తనమే అవుతుంది.
సిఎం చంద్రబాబు నాయుడు విశాఖని రాజధాని చేస్తానని చెప్పలేదు. కానీ అధికారంలోకి రాగానే విశాఖ నగరాభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్దం చేయించి ఒకటొకటిగా అమలుచేస్తున్నారు.
Also Read – పాక్‌పై దాడి అనివార్యమే.. ఆమోదం కోసమే కీలక సమావేశం?
అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో మెట్రో ఏర్పాటు చేసి అప్పుడే 10 ఏళ్ళయ్యింది. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రోని అనుసంధానం చేసేందుకు నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
కానీ విశాఖ నగరానికి సమీపంలో భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం అవుతుండగానే దానిని మెట్రోతో అనుసంధానం చేస్తూ మెట్రో ఏర్పాటుకి సిఎం చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read – ప్రధాని పర్యటనపై వైసీపీ సైలంట్.. అంతేగా అంతేగా!
ప్రపంచ బ్యాంక్ అమరావతి నిర్మాణ పనులకు రూ.15,000 కోట్లు రుణం విడుదల చేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు బెడిసికొట్టాయి. తొలి విడతగా రూ.4,285 కోట్లు విడుదల చేయడంతో అమరావతిలో మళ్ళీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనుల పురోగతిని బట్టి మిగిలిన సొమ్ము కూడా విడుదల చేస్తుంది.
విశాఖలో రూ.154.60 కోట్లు వ్యయంతో బీచ్ రోడ్‌ని జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ 26.72 కిమీ మేర కొత్తగా ఏడు రోడ్లు వేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
కనుక అమరావతి నిర్మాణ పనులు కొలిక్కి వచ్చేలోగా విజయవాడ నుంచి అమరావతికి మెట్రోతో అనుసంధానం చేసే విదంగా కార్యాచరణ రూపొందించారు.
పరిశ్రమలు, పెట్టుబడుల విషయానికి వస్తే, ఇప్పటికే విశాఖ ఆర్‌కే బీచ్ సమీపంలో లులూ గ్రూప్‌కి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రముఖ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రూ.5,000 కోట్లు పెట్టుబడితో 247 ఎకరాలలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, టీవీలు వగైరా తయారుచేసే పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో ప్రత్యక్షంగా 1500 మందికి పరోక్షంగా వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
వచ్చే నెల 8న సిఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేస్తారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిన్నరలో మొదటి దశ ప్లాంట్ పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించబోతోంది.
ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అటు నెల్లూరు, చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఈవిదంగా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పలు పరిశ్రమల నిర్మాణ పనులు వివిద దశలలో సాగుతున్నాయి. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం ఖాయమే!