ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి గురించి పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసినప్పుడు వైసీపీ మంత్రులకు రోషం పొడుచుకువచ్చి ఆయనపై ఎదురుదాడి చేశారు. వారికి తెలంగాణ మంత్రులు అంత కంటే ఘాటుగా జవాబివ్వడంతో మనోళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత సిఎం జగన్మోహన్ రెడ్డి హడావుడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో రోడ్ల మరమత్తులు చేయాలని ఆదేశించారు. అయితే నేటికీ రాష్ట్రంలో పలుజిల్లాలలో రోడ్ల మరమత్తు పనులు ప్రారంభం కానేలేదు.
కృష్ణ జిల్లాలోని దుగ్గిరాలపాడు-జి.కొండూరు రోడ్డు మద్య రోడ్డు పూర్తిగా గుంతలు పడి చాలా కాలమే అయ్యింది. కానీ ఇంతవరకు ఆ రోడ్డుకి మరమత్తులు చేయకపోవడంతో జిల్లాలోని ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి నేతలు ఎన్నిసార్లు స్థానిక అధికారులకు రోడ్డు మరమత్తు చేయాలని కోరినా స్పందించకపోవడంతో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మించలేకపోతోంది. పోలవరం ప్రాజెక్టు కట్టలేక చేతులు ఎత్తేసింది. కనీసం రాష్ట్రంలో పాడైన రోడ్ల మరమత్తులు కూడా చేయించలేకపోతోంది. రోడ్ల మరమత్తులు చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు పాదయాత్ర చేయాల్సిరావడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?” అని ప్రశ్నించారు.



