రాజకీయ విధ్వంసమే బీఆర్ఎస్‌ కొంప ముంచిందా?

Did Political Missteps Trigger the BRS Party's Decline?

రాష్ట్ర విభజనతో తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు. పైగా అన్ని విధాల అభివృద్ధి చెంది, రాష్ట్రానికి అక్షయపాత్రలా నిధులు అందించగల హైదరాబాద్‌ నగరం కూడా లభించింది. కనుక తెలంగాణని శరవేగంగా అభివృద్ధి చేసుకోగలిగారు.

కానీ ఆ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని కూతురు కవితతో సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తూనే ఉంది. తెలంగాణ ఏర్పడితే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వూలో, “ఏ రాష్ట్రానికైనా మొదటి 10-15 ఏళ్ళు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పది, సరైన దారిలో ముందుకు సాగితే ఇక తిరుగు ఉండదు. కానీ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’ కేసీఆర్‌ విస్మరించారు.

ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన ఒక తరం యువత జీవితాలు నాశనం అయ్యాయి. కనుక కేసీఆర్‌ చేసిన మంచి పనులతో పాటు, అయన హయంలో జరిగిన ఈ తప్పులు, నష్టాల గురించి నేను, భవిష్యత్‌ తరాల నాయకులు కూడా మాట్లాడుతూనే ఉంటారు,” అని అన్నారు.

కనుక అభివృద్ధి పేరుతో కేసీఆర్‌ మొదటే దారి తప్పారని సిఎం రేవంత్ రెడ్డి, కూతురు కవిత ఆరోపణలతో స్పష్టమవుతోంది.

కేసీఆర్‌ చేసిన మరో పెద్ద తప్పు తన ‘జాతీయ పగటి కలలు’ నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూయడం! జాతీయ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకొని తన రాజకీయ స్థాయిని పెంచుకోవడానికే ప్రధాని మోడీపై నిత్యం కత్తులు దూస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నానని ప్రజలను మభ్యపెట్టారు. కానీ అందరితో పేచీలు పెట్టుకునే ఆ ధోరణి వలననే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పక తప్పదు.

ఇంతకంటే మరో పెద్ద తప్పు ‘బంగారి తెలంగాణ’ పేరుతో చేసిన ‘రాజకీయ విధ్వంసం.’ ఆ వంకతో తెలంగాణలో బీఆర్ఎస్‌ తప్ప మరో పార్టీ ఉండొద్దనుకుంటే, సరిగ్గా అదే కారణంగా పదేళ్ళలోనే అనేక అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. చివరికి సొంత కూతురే టీఆర్ఎస్‌ పార్టీ పెట్టుకొని తండ్రిని, అయన పాలనని విమర్శిస్తున్నారు.

ఒకవేళ కేసీఆర్‌ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయకుండా ప్రజాస్వామ్యబద్దంగా సాగి ఉంటే ప్రజలు, ప్రతిపక్షాలలో ఇంత అసంతృప్తి ఏర్పడేదే కాదు.

కానీ కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను, ప్రతిపక్షాలను లైట్ తీసుకొని ఇష్టారాజ్యం చేసినందునే నేడు ఆయనకు, బీఆర్ఎస్‌ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

మహా మేధావిగా పేరొందిన కేసీఆర్‌ చేతికి మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రం చేతికి వస్తే పుష్కర కాలంలోనే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికి రావడం ఆశ్చర్యకరమే. కనుక మొదటి 10-15 ఏళ్ళు సరైన దారిలో నడిచి ఉండి ఉంటే నేడు తెలంగాణ, బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి వేరేగా ఉండేదనే కల్వకుంట్ల కవిత అభిప్రాయం సబబుగానే అనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories