సాయికృష్ణ వివాదం ను తన భుజాన వేసుకుని వైసీపీ గత రెండు రోజులుగా మీడియాలో నానా హంగామా చేసింది. టీడీపీ ప్రభుత్వంలో కాపు కులానికి జరిగిన అన్యాయం ఇదని, కూటమి ప్రభుత్వంలో కాపు సామాజికవర్గానికి రక్షణ లేదని ఇలా కుల రాజకీయాలు మొదలుపెట్టింది.
సాయికృష్ణ ను పోలీసులు లాకప్ డెత్ చేసారని, ఏపీలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యమని, సాయికృష్ణ వివాదానికి హోమ్ మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలంటూ వైసీపీ రాజకీయం ప్రభుత్వ పెద్దల టార్గెట్ గా ముందుకెళ్లింది.
ఇక ఏకంగా జగన్ స్వయంగా సాయికృష్ణ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యలను పలకరించి పరామర్శించి మీడియా ముందు సాయికృష్ణ కుటుంబానికి మద్దతు పలికారు, ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీనితో ఈ వివాదాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగిందని, తద్వారా పార్టీకి రాజకీయ లబ్ది చేకూరుతుందని వైసీపీ ఆశించింది.
కానీ కట్ చేస్తే నేడు సాయికృష్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిశారు. సాయికృష్ణ వివాదం పై సత్వర విచారణకు ఆదేశించామని, ఇప్పటికే ఈ వివాదం పై ఆరోపణలు ఎదుర్కుంటున్న సిఐ నాగరాజుని సస్పెండ్ చేశామని,
మీ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత తనదే అంటూ బాబు హామీ ఇవ్వడంతో సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి చెందారు. తమకు ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు అండగా నిలబడ్డారని, తమకు సీఎం బాబు పై ఉప ముఖ్యమంత్రి పవన్ పై పూర్తి నమ్మకం ఉందని మీడియా ముందు ప్రకటించారు.
అలాగే తమ ఆవేదనను ప్రభుత్వం వరకు తీసుకెళ్లిన అన్ని రాజకీయ పార్టీలకు, మీడియాకు ధన్యవాదాలు తెలియచేసారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. అయితే సాయికృష్ణ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తారని, ప్రభుత్వ పెద్దల టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడరని అలాగే వైసీపీ కి అనుకూలంగా ప్రకటలు వస్తాయని వైసీపీ శ్రేణులు భావించారు.
కానీ సాయి కృష్ణ కుటుంబం నుంచి వైసీపీ ఆశించిన స్క్రిప్ట్ బయటకు రాకపోవడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా నీరస పడిపోయినట్టు ఉన్నారు. దీనితో వైసీపీ ఇన్ని రోజులుగా ఆశిస్తున్న రాజకీయ మైలేజ్ తమకు రాకుండా పోయిందని, సాయి కృష్ణ కుటుంబం కూడా తమ పార్టీ నేతల కష్టాన్ని గుర్తించలేదని వైసీపీ నేతలు లోలోపల ఉడికిపోతున్నారు.
తాజాగా మీడియా ముందుకొచ్చిన అంబటి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సాయికృష్ణ వివాదంలో నిన్నటి వరకు సిఐ నాగరాజు మీద చర్యలేవి అంటూ ప్రశ్నించిన అంబటి ఇప్పుడు సిఐ నాగరాజును సస్పెండ్ చేయగానే ప్రభుత్వం తమ అసమర్దతను కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ అధికారులను బలి చేస్తూ దోషులను కాపాడుతుంది అంటూ మాట మార్చారు.
అలాగే నిన్నటి వరకు చిన్నపిల్లోడు తెలిసో తెలియకో తప్పులు చేస్తాడు, అంతమాత్రన ఇలా చేస్తారా అంటూ సాయికృష్ణ ను వెనకేసుకొచ్చిన వైసీపీ ఇపుడు సాయికృష్ణ మీద 21 కేసులున్నాయి అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చెపుతున్నారు, అంటే ఇన్ని కేసులున్న వారికీ జనసేనలో సభ్యత్వమా.? అంటూ ప్లేట్ ను ఇటు ఫిరాయించుతున్నారు. మొత్తానికి ఈ వివాదాన్ని భుజాన వేసుకుని మోసినందుకు చివరికి వైసీపీ ఒరిగింది శూన్యమేనా.?




