ఒక సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ను అంచనా వేయగలిగిన వ్యక్తులలో దిల్ రాజు స్థానం ప్రత్యేకం. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఎలా కొనసాగుతున్నారో అని చెప్పడానికి నిదర్శనంగా తాజా ఉదంతం నిలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన “రాజా ది గ్రేట్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా… సెంటిమెంట్ కు విరుద్ధంగా దీపావళికి విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారు.
సినిమా విడుదలకు ముందు దిల్ రాజుకు ఎందుకు అంత నమ్మకమో, బొమ్మ సిల్వర్ స్క్రీన్ పై పడిన తర్వాత తెలిసి వచ్చింది. బుధవారం నాడు విడుదలైన ఈ సినిమాకు తొలుత భిన్న స్పందనలు వచ్చినప్పటికీ, ఓవరాల్ గా ‘టైం పాస్ ఎంటర్టైనర్’గా పేరు తెచ్చుకుంది. దీనికి తోడు తొలి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చినట్లుగా ట్రేడ్ టాక్. రికార్డు స్థాయిలో వసూళ్లు కాకపోయినప్పటికీ, బుధవారం నాడు రిలీజ్ అయిన దరిమిలా అంచనాలకు మించే విధంగానే ఓపెనింగ్స్ దక్కినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు రెండవ రోజు దీపావళి సెలవు కావడంతో, మార్నింగ్ కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో, కమర్షియల్ గా “రాజా ది గ్రేట్” సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ జాబితాలోకి వెళ్ళడం ఖాయంగా కనపడుతోంది. బాక్సాఫీస్ వద్ద మరే సినిమా లేకపోవడం, అలాగే ఈ లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో, ఆదివారం నాటికి బ్రేక్ ఈవెన్ స్థాయికి వచ్చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రెండేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చిన రవితేజకు ప్రేక్షకులు నీరాజనం పలకడంతో, దర్శకుడు అనిల్ రావిపూడి ఖాతాలో హ్యాట్రిక్ కూడా పడినట్లయ్యింది.


