ఏదైనా ఒక సినీ వేడుక జరుగుతోంది అంటే… దానికి ఎవరెవరూ ముఖ్య అతిధులుగా వస్తున్నారు అన్న అంశం కంటే, అందులో సినీ అభిమానులు ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నది ప్రస్తుత తరుణంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందుకు “దర్శకుడు” సినిమా ఆడియో వేడుక కూడా ఏం విరుద్ధం కాదని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిధిగా విచ్చేయడంతో తేలిపోయింది.
ఈ సినిమా దర్శకుడు జక్కా హరిప్రసాద్ ప్రసంగిస్తూ… చిత్ర యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరిగా కృతజ్ఞతలు చెప్తున్న సమయంలో… మెగా ఫ్యాన్స్ నుండి రామ్ చరణ్ గురించి చెప్పాల్సిందిగా కేకలు వేసారు. ‘ఒక్క నిముషం ఆగండి’ నేను చెప్పేసాక ఆయనే మాట్లాడతారు అని సదరు దర్శకుడు అభిమానులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో వెనుక నుండి వచ్చిన సుకుమార్, దర్శకుడు జక్కా చెవిలో ఏదో చెప్పారు.
సుక్కూ అలా చెప్పి వెళ్ళారో లేదో… చిత్ర దర్శకుడు హరిప్రసాద్ మాటలు ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి వైపుకు వెళ్ళాయి. తాను ‘ఖైదీ’ సినిమా చూసిన నాటి రోజులు గుర్తు చేసుకున్న జక్కా, ఒక్కసారిగా చిరుపై పొగడ్తలు కురిపించారు. ఈ వ్యాఖ్యలతో శాంతించిన మెగా ఫ్యాన్స్ కాసేపు శాంతించడం విశేషం. దీంతో మెగా ఫ్యాన్స్ ‘కిటుకు’ ఏమిటో, దర్శకుడు సుకుమార్ బాగానే పట్టికెళ్ళినట్లున్నారు అంటున్నారు నెటిజన్లు.



