సోషల్ మీడియాలో బురద జల్లే బ్యాచులకు కొదవే లేదు. ఏదో ఒక కారణం దొరకాలే కానీ దాన్ని పట్టుకుని వేలాడుతూ వైరస్ లాగా దాన్ని అందరికీ పాకించేలా చూస్తారు. ఆదిపురుష్ టీజర్ తో మొదలైన ఈ రగడ ట్రైలర్లు వచ్చాక తగ్గుముఖం పట్టింది కానీ ప్రమోషన్లను పట్టుకుని ట్రోలింగ్ కోసమని కొత్త కొత్త పాయింట్లు బయటికి తీస్తున్నారు.
నిన్న తిరుమల కొండపై దర్శనం చేసుకుని వచ్చాక కృతి సనన్ కి దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం మీద కొందరు భగ్గుమంటున్నారు. ఆ ఒక్క సీన్ ని రీప్లే చేస్తూ అతను గాడ్ బ్లెస్ అనడం మాత్రం మ్యూట్ చేస్తున్నారు. నిజానికి కొండ మీద అలాంటివి సమర్ధనీయం కాదు కానీ అక్కడ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మహా పాపం చేసినట్టుగా శోకాలు పెట్టడమే అసలు కామెడీ.
హనుమంతుడికి ఒక సీట్ వదలడం గురించి ఇప్పటికే లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. ఒక సెంటిమెంట్ ని గౌరవించడం కోసం అలా చేయమని చెబుతున్నామని దర్శక నిర్మాతలు ముందే చెప్పారు. అయినా ట్రోలర్స్ పెడచెవిన పెట్టి మరీ ఇంటర్వెల్ లో పాప్ కార్న్ బదులు ప్రసాదాలు ఇస్తారా అంటూ కామెడీలు చేస్తున్నారు. ఇంకా ఈ ఆరేడు రోజుల్లో ఎన్నెన్ని ఇలాంటి విన్యాసాలు చూడాలో.
అందరికీ తెలిసిన కథని, వందల సార్లు స్క్రీన్ మీద బుల్లితెరపై వచ్చిన రామాయణాన్ని టెక్నాలజీ సహాయంతో చూపించడం తప్ప ఆదిపురుష్ టీమ్ చేసిందేమి లేదు. ప్రభాస్ హీరో కాబట్టి దీని మీద ఇంత చర్చ. ఒక ఇతిహాస గాథ వేల కోట్ల బిజినెస్ ని లక్ష్యంగా చేసుకోవడం జీర్ణించుకోలేని వాళ్ళ నుంచి వచ్చిన కవ్వింపు.
రిలీజయ్యాక ఆదిపురుష్ అంచనాలను మించి ఉండొచ్చు లేదా నిరాశపరచొచ్చు. దీనికీ ఇప్పుడీ కంక్లూజన్ ఇవ్వలేం. రాముడి కథ కాబట్టి ప్రభాస్ సినిమా విమర్శలకు అతీతమని ఎవరూ అనరు. కాకపోతే ఇలాంటి అవసరపు వివాదాలు, ప్రచారాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఆడియన్స్ కి కొత్తదనం అనిపించకపోతే ఆదిపురుష్ అయినా మరొకటైనా తిరస్కరిస్తారు.
లేదూ బ్రహ్మాండంగా ఉందంటే కనక వర్షం కురిపిస్తారు. అది తేలేది జూన్ 16 తర్వాతే. ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలకే వందల కోట్లు ఇచ్చిన ప్రేక్షకులు ఆదిపురుష్ లో అన్నీ సమపాళ్లలో ఉంటే ఎందుకు నో అంటారు. ఒకవేళ అంటే ఏదో తేడా జరిగినట్టే. ఆ తీర్పు వచ్చే దాకా ఓపిక పట్టకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది తరహాలో ట్విట్టర్ ఇన్స్ టాలో చేస్తున్న ఈ ఆర్తనాదాలు ఏ కామెడీకి తీసిపోవు.



