Ahimsa Movie Reviewదర్శకుడు తేజది ఒక ప్రత్యేక బ్రాండ్. ముక్కుమొహం తెలియని కుర్రాళ్లతో బ్లాక్ బస్టర్లు సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. అయితే అదంతా గతం. గత కొన్నేళ్లుగా ఈయన మార్కు సినిమా రాలేదు. నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ అయినా అందులో మేజర్ క్రెడిట్ రానాకే దక్కుతుంది. తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సీతతో తేజ తానింకా మారలేదని నిరూపించారు. సరే హిట్లు ఫ్లాపులు సహజం కాబట్టి అభిరాంని పరిచయం చేస్తూ తీసిన అహింసతో ఏదైనా స్వీట్ షాక్ ఇస్తారేమోనని ఎదురు చూసిన ఆడియన్స్ లేకపోలేదు.

చిట్టడవి దగ్గరలో ఉండే ఒక చిన్న పల్లెటూళ్ళో బావ మరదళ్లు రఘు(అభిరాం) అహల్య(గీతికా తివారి)లు ప్రేమించుకుంటూ ఉంటారు. రఘు స్వతహాగా అహింసని ఇష్టపడే భయస్తుడు. కోటీశ్వరులైన దుశ్యంత్ రావు(రజత్ బేడీ) కొడుకుల వల్ల అహల్య ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వీళ్లకు అండగా లాయర్ లక్ష్మి(సదా)నిలబడుతుంది. అయితే రఘు అహల్య అంత సులభంగా బయటకు రాలేని ప్రమాదకర వలయంలో చిక్కుకుంటారు. వీళ్ళను వెతుకుతున్న పోలీసులు, విలన్లకు చివరికి ఏం ట్విస్ట్ ఇచ్చారనేదే స్టోరీ.

ఇరవై ఏళ్ళ క్రితం నాటి పాత జోకులతో, అతిగా అనిపించే హీరోయిన్ రొమాన్స్ తో నేరేషన్ మొదలుపెట్టిన తేజ అహల్య మీద దాడి జరిగాక వేగం పెంచారు. ఇక్కడా కొన్ని రొటీన్ సన్నివేశాలు, మహేష్ బాబు నిజం తరహా కోర్టు ఎపిసోడ్లు పడినప్పటికీ మరీ విసుగు రాకుండా నెట్టుకు రాగలిగారు. అనుభవం లేకపోతే ఈ సీన్లు చాలా ఫ్లాట్ గా వచ్చేవి. తేజ ఇక్కడ మాత్రం తన సీనియారిటీ కొంతమేరకు చూపించారు. న్యాయస్థానంతో పనైపోయి అడవికి వచ్చాక అసలు హింస థియేటర్లో ఆడియన్స్ కి మెల్లగా మొదలవుతుంది.

లీడ్ పెయిర్ ని పదే పదే పరిగెత్తించడం తేజ స్టైల్. ఇది వర్మ దగ్గర శిష్యరికం చేసినప్పుడు నేర్చుకున్నది. ఇప్పుడిది అవుట్ డేటెడ్. కానీ తేజ మాత్రం తిరిగి అదే ఫాలో అయ్యారు. అవసరం లేని ఉపకథలను కేవలం లెన్త్ కోసం ఇరికించడంతో స్క్రీన్ ప్లే ఎక్కడికక్కడ పక్కదారి పట్టేసింది. రౌడీలకు నక్సలైట్లకు మధ్యరకంగా అనిపించే ఓ మాఫియా గ్యాంగ్ ని అడవిలో పెట్టడం ఏ మాత్రం అవసరం లేని ప్రహసనం. ట్విస్టు కోసమని ఆ ముఠాని మళ్ళీ ఊరికి తీసుకొచ్చి రఘు వెంటపడేలా చేయడం మిగిలున్న ఓపికను పూర్తిగా చంపేస్తుంది.

ఎప్పుడైతే రఘు అహల్యలు అడవిలోకి వెళ్లారో తప్పించుకోవడం తప్ప వేరే లక్ష్యం లేకపోయింది. తేజ చేతిలో కంటెంట్ తగ్గిపోయింది. దీంతో సహజంగానే అవసరం లేని సరుకు చేరిపోయింది. ప్రీ క్లైమాక్స్ ముందు సీరియస్ గా సాగే టైంలో ఐటెం సాంగ్ పెట్టడం ఏ కాలం టేస్టో అర్థం చేసుకోవాలి. ఇలాంటివి బోలెడు మచ్చుతునకలున్నాయి. ఆర్టిస్టుగా అభిరాం భయం తప్ప ఇంకో ఎక్స్ ప్రెషన్ ఇస్తే ఒట్టు. గీతికా సైతం తేలిపోయింది. రిటైరయ్యే వయసులో సెంచరీ కొట్టాలంటే బ్యాట్స్ మెన్ కి ఫిట్ నెస్ అవసరం. క్రియేటివిటీ అడుగంటిపోయిన టైంలో బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ట్రెండీ కంటెంట్ అవసరం. దర్శకులు తేజ ఈ సూత్రం మర్చిపోయారు.